భారత్ – పాక్ సంబంధాలు కఠినంగానే ఉన్నా, సహజ విపత్తుల సమయంలో మానవత్వం ముందు నిలబడుతుందని తాజా పరిణామం స్పష్టమైంది. జమ్మూకశ్మీర్‌లోని తావి నది ఉప్పొంగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయగా, ఆ వరద ముప్పు పాకిస్థాన్‌పై పడే అవకాశాన్ని గుర్తించి భారత్ ముందుగానే సమాచారం అందించింది. సింధూ నది జలాల ఒప్పందం నిలిచిపోయిన పరిస్థితుల్లోనూ, ఈ చర్య మానవతా దృష్టిలో ఒక సానుకూల సంకేతంగా కనిపిస్తోంది.
దిల్లీలోని భారత హైకమిషన్ అధికారులు ఇస్లామాబాద్‌కు ఈ విషయాన్ని చేరవేయడంతో పాక్ ప్రభుత్వం వెంటనే తమ ప్రజలకు వరద హెచ్చరికలు జారీ చేసింది. సాధారణంగా ఇలాంటి సమాచారం సింధూ నది జలాల ఒప్పంద కమిషనర్ ద్వారా పంచుకునే పద్ధతి ఉన్నప్పటికీ, ఒప్పందం నిలిపివేయబడిన తర్వాత ఇప్పుడు నేరుగా దౌత్య కార్యాలయం ద్వారా సమాచారం చేరడం విశేషం. ఈ చర్య పాక్‌కు మానవత్వ పరిరక్షణలో భారత్ తీసుకున్న ముందడుగుగా భావించవచ్చు.
ఇక పాకిస్థాన్‌లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఇప్పటికే తీవ్ర నష్టాన్ని కలిగించాయి. జూన్ 26 నుంచి ఇప్పటి వరకు 780 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. అనేక ప్రాంతాల్లో ఇళ్లు, పంటలు నాశనమయ్యాయి. ఈ పరిస్థితుల్లో భారత్ ఇచ్చిన తాజా హెచ్చరిక పాక్ అధికారులకు సహాయపడే అవకాశముంది.
గమనించదగ్గ విషయం ఏంటంటే, ఏప్రిల్‌లో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఆ సమయంలో సంబంధాలు మరింత కఠినమయ్యాయి. అయినా కూడా ఈసారి వరదల ముప్పు నేపథ్యంలో ముందుగా పాక్‌ను అలర్ట్ చేయడం, “భేదాభిప్రాయాలు పక్కన పెట్టి మానవ ప్రాణాలను కాపాడాలి” అనే సందేశాన్ని ఇస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates