ఎమ్మెల్యే వెర్సస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్… కొత్త వివాదం

ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ‘వార్-2’ రిలీజ్ సందర్భంగా అనంతపురంలో లీక్ అయిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆడియో కాల్ ఎంత కలకలం రేపిందో తెలిసిందే. వార్-2 సినిమా స్పెషల్ షోలకు పర్మిషన్లు ఎలా ఇచ్చారంటూ ఓ వ్యక్తిని నిలదీస్తూ.. ఎన్టీఆర్‌ను ఉద్దేశించి దారుణమైన బూతులు మాట్లాడారు ప్రసాద్. ఐతే ఆ ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదంటూ ఆయన వివరణ ఇస్తూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. 

అదే సమయంలో తారక్ అభిమానులకు సారీ చెప్పారు. కానీ ఫ్యాన్స్ శాంతించలేదు. ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించడంతో పాటు అనంతపురంలో నిరసన ప్రదర్శనలు చేశారు. ఎన్టీఆర్‌కు, ఆయన తల్లికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ మీట్ కూడా పెట్టి ఎమ్మెల్యేకు అల్టిమేటం విధించారు తారక్ ఫ్యాన్స్. మరి ఎమ్మెల్యే నుంచి ఏం స్పందన ఉంటుందా అని అందరూ ఎదురు చూస్తుండగా.. కొత్త వివాదం తెరపైకి వచ్చింది.

ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడిన వ్యక్తి లైన్లోకి వచ్చారు. ఆ వ్యక్తి పేరు.. ధనుంజయ నాయుడు. అతను తెలుగుదేశం పార్టీ స్టూడెండ్ వింగ్ అయిన తెలుగునాడు విద్యార్థి విభాగం (టీఎన్ఎస్ఎఫ్) అనంతపురం అధ్యక్షుడు. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ అతను మీడియాలోకి వచ్చాడు. ఎమ్మెల్యే ఫోన్ కాల్ రికార్డ్ చేసినందుకు ఆయన మనషులు, తన కుటుంబాన్ని బెదిరిస్తున్నట్లుగా అతను ఆరోపిస్తున్నాడు. 

ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ ఫేక్ అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని ఎమ్మెల్యే మనుషులు ఒత్తిడి తెస్తుందన్నట్లు అతను చెప్పాడు. తనకు రక్షణ కల్పించి, ఎమ్మెల్యేపై అధిష్టానం చర్యలు తీసుకోవాలని అతను కోరాడు. ఈ పరిణామం తారక్ అభిమానులకు మరింత ఆగ్రహం తెప్పిస్తుందనడంలో సందేహం లేదు. ధనుంజయ నాయుడు ఆరోపణలతో ఎమ్మెల్యే మరింత చిక్కుల్లో పడ్డట్లే కనిపిస్తున్నారు.