ఉత్తరప్రదేశ్ గాజియాబాద్‌కు చెందిన శాను అనే యువతి తన భర్త, అత్తింటి వేధింపులు తట్టుకోలేక చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శాను తన ఫిర్యాదులో చెప్పిన విషయాలు షాక్‌కు గురి చేస్తున్నాయి. భర్త శివమ్ ఉజ్జ్వాల్ తనను బోలీవుడ్ నటి నోరా ఫతేహీలా కనిపించాలంటూ రోజూ మూడు గంటలు వ్యాయామం చేయమని బలవంతం చేసేవాడని, చేయకపోతే తినేందుకు ఆహారం కూడా నిరాకరించేవాడని ఆమె వాపోయింది.
శాను వివాహం మార్చి 6న జరిగింది. రూ.76 లక్షలకుపైగా ఖర్చు చేసి, కట్నంగా బంగారు నగలు, స్కార్పియో కారు, నగదు ఇచ్చినప్పటికీ, పెళ్లి తర్వాత జీవితం భయానకంగా మారినట్లు తెలిపింది. అత్తింటివారు ఎల్లప్పుడూ పనులు చెబుతూ, భర్తతో గడిపే సమయం కూడా నిరాకరించేవారని ఆమె చెప్పింది. శివమ్ ఫిట్నెస్ ట్రైనర్, అతను ఇంట్లో తనకే కష్టాలు తెచ్చేవాడని, ఒక్కోసారి చిన్న విషయానికే దారుణంగా కొట్టేవాడని శాను తెలిపింది.
అంతటితో ఆగకుండా, శివమ్ తరచూ ఇతర మహిళలతో అనుచితంగా వ్యవహరించేవాడని, సోషల్ మీడియాలో అభ్యంతరకర వీడియోలు చూసేవాడని ఆమె ఆరోపించింది. తాను సాదారణ శరీరాకృతిలో ఉండటమే తన జీవితాన్ని పాడుచేసిందని భర్త నిందలు వేస్తూ, తనను బాడీ షేమ్ చేసేవాడని బాధను వ్యక్తం చేసింది. “నువ్వు లావుగా, అందవిహీనంగా ఉన్నావు… నాకు నోరా ఫతేహీలా కావాలి” అంటూ తిడుతూ, కొట్టేవాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
ఈ మధ్యలో శాను గర్భవతి అయ్యింది. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. అత్తింటివారు గర్భాన్ని అంగీకరించకుండా, రహస్యంగా గర్భస్రావ మాత్రలు ఇచ్చి తినిపించారని ఆమె ఆరోపించింది. మసాలాలు కలిపి తినిపించడంతో గొంతు మండిపోయిందని, చివరికి అధిక రక్తస్రావం కారణంగా గర్భస్రావం జరిగిపోయిందని కన్నీళ్లు పెట్టుకుంది.
జూన్‌లో తల్లిదండ్రులు ఆమెను తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. ఆ తర్వాత అత్తింటివారు ఆమెకు విడాకులు ఇస్తామని బెదిరించడమే కాకుండా, పెళ్లిలో ఇచ్చిన బంగారు నగలు, బట్టలు కూడా తిరిగి ఇవ్వలేదని ఆరోపించింది. ఆగస్టు 14న ఆమె అధికారికంగా ఫిర్యాదు నమోదు చేయగా, పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates