పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఎంతటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయో తెలిసిందే. చిన్నపాటి యుద్ధం కూడా జరిగింది రెండు దేశాల మధ్య. పాక్‌తో వాణిజ్య బంధాన్ని చాలా వరకు తెంచుకునే ప్రయత్నంలో పడింది ఇండియా. ఆ దేశానికి వెళ్లే సింధు జలాలకు కూడా అడ్డు కట్ట వేసింది. అది దాయాది దేశానికి ఇండియా ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. పాకిస్థాన్ పేరు చెబితే చాలు మన వాళ్లు మండిపడుతున్నారు. ఆ దేశంతో అన్ని రకాల సంబంధాలూ తెంచుకోవాలని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. క్రీడా రంగంలోనూ పాక్‌తో ఎలాంటి సంబంధాలూ ఉండొద్దన్నది వాళ్ల వాదన. ఐతే బీసీసీఐ మాత్రం ఆ దిశగా అడుగులు వేయట్లేదని.. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో ఇండియా మ్యాచ్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని.. డబ్బు కోసం దేశ ప్రతిష్ఠను తాకట్టు పెడుతోందని సోషల్ మీడియా జనాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
పాకిస్థాన్ బరిలో ఉన్న ఆసియా కప్ టీ20 టోర్నీని బహిష్కరించాలని ముందు నుంచి ఒక వర్గం బీసీసీఐని డిమాండ్ చేస్తోంది. లెజెండ్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో రిటైరైన ఆటగాళ్లు పాకిస్థాన్‌తో లీగ్ మ్యాచ్‌ను బహిష్కరించారు. తర్వాత మన జట్టు సెమీస్ చేరినా సరే.. పాకిస్థాన్‌తో ఆడేందుకు ఒప్పుకోలేదు. పాక్ నేరుగా ఫైనల్ చేరింది. మన వాళ్లు ఇంటిముఖం పట్టారు. అక్కడ చూపిన పట్టుదలే అంతర్జాతీయ క్రికెట్లోనూ చూపించాలని.. కానీ బీసీసీఐకి మాత్రం కాసులే ముఖ్యమని, అందుకే ఇండియన్ టీంతో ఆసియా కప్ ఆడిస్తోందని.. పాకిస్థాన్‌తో తలపడక తప్పని పరిస్థితి తెచ్చిందని నెటిజన్లు మండిపడుతున్నారు.
నిన్న ఆసియా కప్‌కు భారత జట్టును ఎంపిక చేసిన నేపథ్యంలో బీసీసీఐకి వ్యతిరేకంగా ##deshdrohibcci సహా పలు హ్యాష్ ట్యాగ్‌లను ట్రెండ్ చేశారు. ఐతే పాక్‌తో ఇండియా ఎప్పట్నుంచో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడట్లేదు. ఆ దేశంలో ఏదైనా టోర్నీ జరిగినా వెళ్లట్లేదు. ఈ విషయంలో ఐసీసీ ఎంత ఒత్తిడి చేసినా భారత్ తలొగ్గలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌కు వెళ్లనంటే వెళ్లమని తేల్చి చెప్పడంతో ఇండియా మ్యాచ్‌లను మాత్రం యూఏఈలో నిర్వహించారు.
పాకిస్థాన్ సైతం అక్కడికే వచ్చి ఇండియాతో తలపడింది. ఐతే పాక్ ఉంది కదా అని మల్టీ నేషన్ టోర్నీల నుంచి పూర్తిగా తప్పుకుంటే అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగడం కష్టమవుతుంది. ఐసీసీ నిషేధం ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ప్రపంచ క్రికెట్లో బీసీసీఐ ఎంత పవర్ ఫుల్ అయినప్పటికీ.. ఇలా మల్టీ నేషన్స్ టోర్నీల్లో పాక్‌తో తలపడనంటే ఇబ్బంది అవుతుంది. అందుకే ఎన్ని విమర్శలు వచ్చినా ఆసియా కప్‌లో ఇండియన్ టీం బరిలో దిగడానికే బీసీసీఐ మొగ్గు చూపిందని భావించాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates