సోమవారం మధ్యాహ్నం ఎయిర్టెల్ నెట్‌వర్క్ ఒక్కసారిగా కుప్పకూలింది. ముఖ్యంగా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోనే కాకుండా దేశవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులు కాల్స్ చేయలేకపోవడం, మెసేజ్‌లు పంపలేకపోవడం, మొబైల్ ఇంటర్నెట్ పనిచేయకపోవడం వంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. డౌన్‌డిటెక్టర్ వెబ్‌సైట్‌లో సుమారు 3,200 ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిలో 66 శాతం నెట్‌వర్క్ సమస్యలు, 18 శాతం డేటా యాక్సెస్ సమస్యలు, 16 శాతం సిగ్నల్ లేకపోవడంపైగా ఉన్నాయి.
యూజర్లు X (ట్విట్టర్)లో కూడా తమ సమస్యలను షేర్ చేసుకున్నారు. “కాల్ వస్తే లిఫ్ట్ అవ్వడం లేదు, SMS రావడం లేదు, OTPలు అందడం లేదు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ లావాదేవీలు, బ్యాంకింగ్, వర్క్ యాప్స్ అన్నీ OTPలపై ఆధారపడుతుండటంతో అనేకమంది యూజర్లు పనుల్లో ఇరుక్కుపోయారు. పలు యూజర్లు “5జీ ప్లాన్ వేసుకున్నా, ఇప్పుడు 4జీ కూడా సరిగా పని చేయడం లేదు” అంటూ వ్యంగ్యంగా స్పందించారు.
నెట్‌వర్క్ డౌన్ సమస్య రెండు గంటలకు పైగా కొనసాగిందని యూజర్ల ఫిర్యాదులు చెబుతున్నాయి. దేశంలోని ఇతర నగరాల్లోనూ ఈ సమస్యలు తలెత్తాయని సమాచారం. డౌన్‌డిటెక్టర్‌లో నమోదైన ఫిర్యాదుల కంటే నిజంగా ఇబ్బంది పడ్డవారి సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఈసమయంలో ఎయిర్టెల్ సంస్థ సోషల్ మీడియాలో స్పందించింది. ప్రస్తుతం నెట్‌వర్క్ అవుటేజ్ ఉందని అంగీకరించి, “మా టెక్నికల్ టీమ్ సమస్య పరిష్కారంపై పని చేస్తోంది. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. త్వరలోనే సేవలు పునరుద్ధరిస్తాం” అని పేర్కొంది. అయితే సమస్య ఎప్పుడు పూర్తిగా పరిష్కారం అవుతుందన్న సమయం మాత్రం ఇవ్వలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates