ఆసియా కప్‌ 2025: 10 సెకన్లకు రూ.16 లక్షలు

ఆసియా కప్‌ 2025 సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఈసారి టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరుగుతుంది. సెప్టెంబర్ 10న భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. టీమ్ఇండియా బరిలోకి దిగుతున్న ప్రతి మ్యాచ్‌కి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తుండటంతో, ప్రకటనల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ ఉంటే, యాడ్ రేట్లు రికార్డులు బద్దలుకొట్టే అవకాశం ఉంది.

ఈసారి ఆసియా కప్‌ ప్రసార హక్కులు (170 మిలియన్ డాలర్స్) 2031 వరకు సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (SPNI) సొంతం చేసుకుంది. దీంతో మ్యాచ్‌లన్నీ సోనీ స్పోర్ట్స్‌లో, డిజిటల్‌ ప్లాట్‌ఫాం SonyLIVలో లైవ్‌గా ప్రసారం కానున్నాయి. టోర్నీపై కోట్లాది కళ్లున్నందున, ప్రకటనదారులు తమ ఉత్పత్తులకు బలమైన మార్కెట్ దొరకుతుందని నమ్ముతున్నారు. అందుకే సోనీ నెట్‌వర్క్ ఇండియా మ్యాచ్‌లకు భారీ ధరలు పెట్టింది.

టీమ్ఇండియా మ్యాచ్‌లకు ప్రత్యేక డిమాండ్ ఉండటంతో, 10 సెకన్ల యాడ్‌కే రూ.14 నుంచి రూ.16 లక్షల వరకు రేటు నిర్ణయించారు. ఇది గత టోర్నీలతో పోలిస్తే చాలా ఎక్కువ. ఉదాహరణకు, భారత్ పాకిస్థాన్ మ్యాచ్ ప్రసారమైతే వ్యూయర్‌షిప్ కోట్లు దాటుతుందని అంచనా. ఒక్క యాడ్ ద్వారా ప్రసారకర్తలు వందల కోట్ల ఆదాయం సంపాదించే అవకాశం ఉంది.

అయితే ఇక్కడ ఒక సందేహం కొనసాగుతోంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 14న భారత్ పాకిస్థాన్ తలపడాలి. కానీ ఇటీవల లెజెండ్స్ టోర్నీలో పాక్‌తో ఆడేందుకు భారత జట్టు నిరాకరించడంతో, ఆసియా కప్‌లో ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న ప్రశ్న తలెత్తింది. ఒకవేళ ఈ మ్యాచ్ జరిగితే, అది టోర్నీ మొత్తం హైలైట్ అవుతుంది. మొత్తం మీద, ఈసారి ఆసియా కప్‌ కేవలం క్రికెట్ అభిమానుల పండుగ మాత్రమే కాదు, ప్రకటనదారులకు కూడా బంగారు గనిలా మారబోతోంది.