ధోనీ నిర్ణయంతోనే జట్టులో చోటు కోల్పోయా

భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, తన కెరీర్‌లో కీలక సమయంలో జట్టులోంచి పక్కన పడటానికి అప్పటి కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ నిర్ణయమే కారణమని బహిరంగంగా చెప్పాడు. ఇటీవలే వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇదే తరహా ఆరోపణలు చేసిన నేపథ్యంలో, ఇర్ఫాన్ వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. శ్రీలంకతో మ్యాచ్‌లో తాను, అన్న యూసఫ్ పఠాన్ కలిసి క్లిష్ట పరిస్థితుల్లో విజయాన్ని అందించినప్పటికీ, ఆ తరువాతి సిరీస్‌కే తనను పక్కన పెట్టారని ఇర్ఫాన్ చెప్పాడు.

ఇర్ఫాన్ మాట్లాడుతూ, ఆ మ్యాచ్‌లో 27 బంతుల్లో 60 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఉండగా, ఇద్దరం కలిసి మ్యాచ్ ను ఫినిష్ చేశాం. ఆ స్థాయిలో ప్రదర్శన చేసిన ఆటగాడిని సాధారణంగా ఏడాది పాటు అయినా జట్టులో ఉంచుతారని అనుకున్నా, కానీ నా విషయంలో అలా జరగలేదని అతను పేర్కొన్నాడు. న్యూజిలాండ్ పర్యటనలో మూడు మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితం కాగా, నాలుగో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఐదో మ్యాచ్‌లో కూడా అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

అసలు కారణం తెలుసుకోవడానికి అప్పటి కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌ను సంప్రదించానని, ఆయన రెండు కారణాలు చెప్పారని ఇర్ఫాన్ వెల్లడించాడు. కొన్ని విషయాలు తన చేతుల్లో లేవని కిర్‌స్టెన్ చెప్పడంతో, తుది నిర్ణయం కెప్టెన్‌దేనని అర్థమైందని తెలిపాడు. ధోనీ తీసుకున్న నిర్ణయం సరైందా, కాదా అనేది తాను నిర్ణయించలేనని, కానీ ప్రతి కెప్టెన్‌కి తన స్టైల్‌లో జట్టును నడిపించే హక్కు ఉంటుందని అన్నాడు.

కిర్‌స్టెన్ చెప్పిన రెండో కారణం మరింత స్పష్టతనిచ్చింది. జట్టులో నం.7 స్థానంలో బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌ని ఉంచాలని నిర్ణయించారని, తన బ్రదర్ యూసఫ్ పఠాన్ ఆ కేటగిరీకి సరిపోతాడని, తాను మాత్రం బౌలింగ్ ఆల్‌రౌండర్ కాబట్టి చోటు కోల్పోయానని తెలిపాడు. ఆ సమయంలో ఒక్క ఆల్‌రౌండర్‌కి మాత్రమే అవకాశం ఉండగా, ఇప్పుడు జట్టులో ఇద్దరిని కూడా తీసుకుంటున్నారని వ్యాఖ్యానించాడు. 2009లో జట్టులో నుంచి తప్పుకున్న ఇర్ఫాన్, 2012లో తిరిగి వచ్చినా ఎక్కువ కాలం కొనసాగలేకపోయాడు. చివరగా 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక ఈ వ్యాఖ్యలతో మరోసారి ధోనీ నాయకత్వ కాలంలో తీసుకున్న సెలెక్షన్ నిర్ణయాలపై చర్చ మొదలైంది.