భారతదేశంలో లైంగిక సంబంధాలకు కనీస వయోపరిమితి 18ఏళ్లే తప్పనిసరి అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించింది. సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో, ఈ వయోపరిమితిని 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలన్న సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ అభ్యర్థనను కేంద్రం తిరస్కరించింది. పిల్లలను రక్షించేందుకు, మైనారిటీలపై లైంగిక దుర్వినియోగాన్ని అరికట్టేందుకు 18ఏళ్ల వయోపరిమితిని ఉద్దేశపూర్వకంగా, పూర్తిగా ఆలోచించి అమలు చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.
ప్రస్తుతం దేశంలోని పిల్లల భద్రత కోసం ఈ నియమాన్ని ఉంచినట్టు అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటి కోర్టుకు లిఖిత పూర్వకంగా సమర్పించారు. యువతలో పెరుగుతున్న శృంగార భావోద్వేగాలు, ప్రేమ పేరుతో చిన్న వయస్సులోనే లైంగిక సంబంధాలు ఏర్పడే అవకాశం ఉన్నందున ఈ పరిమితి చాలా అవసరం అని ఆమె అన్నారు. పిల్లల మౌనాన్ని, అర్థం చేసుకోలేని భావోద్వేగాలను ఆసరాగా చేసుకొని లైంగిక దురాగతాలకు పాల్పడే వారిని ఈ నిబంధన కట్టడి చేస్తుందని చెప్పారు.
ఇక వయోపరిమితిని తగ్గిస్తే దాని వల్ల పెద్ద ఎత్తున ప్రమాదాలు ఏర్పడే అవకాశముందని కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా పిల్లల అక్రమ రవాణా, బాలలపై లైంగిక నేరాలు అదుపుతప్పే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా మహిళల భద్రత, బాలల హక్కులు, పిల్లల ఆరోగ్య రక్షణ కోసం ఈ వయోపరిమితి అత్యంత కీలకమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇక యువతీ యువకుల మధ్య ప్రేమలో శృంగార భావాలు తక్కువ వయస్సులో పెరగడం, సోషల్ మీడియా ప్రభావం వల్ల ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వయోపరిమితి తగ్గితే, చిన్నారుల భవిష్యత్ ముప్పులో పడే ప్రమాదం ఉందని న్యాయవాదులు కూడా వాదిస్తున్నారు. పౌరసత్వం పొందే వయస్సు 18ఏళ్లు కాగా, లైంగిక సహజీవనానికి కూడా అదే వయస్సు ఉండడం సమంజసమే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates