కిరాణా కొట్టు యజమానికి.. కోహ్లీ, పాటిదార్, ABD వరుస కాల్స్!

ఛత్తీస్‌గఢ్‌లోని ఓ చిన్న గ్రామంలో కిరాణా వ్యాపారి జీవితంలో ఊహించని సంఘటన జరిగింది. వరుసగా వచ్చే ఫోన్ కాల్స్‌లో ఒక్కొక్కరు నేను విరాట్ కోహ్లీ, నేను ఏబీ డివిలియర్స్ అని చెప్పడం మొదలుపెట్టారు. మొదట ఇది ఫ్రాంక్ కాల్ అనుకున్న వ్యాపారి, ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రాజత్ పాటిదార్ స్వయంగా ఫోన్ చేయడంతో కథ మలుపు తిప్పుకుంది. నిజం తెలియని ఆ వ్యక్తి “నేను సీఎస్‌కే కెప్టెన్ ధోనీ” అని కౌంటర్ తరహాలో జవాబిచ్చాడు. 

కానీ ఈ కాల్స్ వెనుక అసలు నిజం బయటకు రావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. విషయం ఏంటంటే, రాజత్ పాటిదార్ వాడిన పాత సిమ్ కార్డ్‌ను మూడు నెలలుగా రీచార్జ్ చేయకపోవడంతో టెలికాం కంపెనీ దాన్ని డీయాక్టివేట్ చేసింది. TRAI నిబంధనల ప్రకారం, ఇలాంటి సిమ్ నంబర్లు కొంతకాలం తర్వాత కొత్త కస్టమర్లకు ఇస్తారు. ఆ విధంగానే ఆ నంబర్ జూన్ 28న మణీష్ అనే వ్యాపారికి రీఅసైన్ అయింది. 

సిమ్ వేసిన వెంటనే వాట్సాప్‌లో పాటిదార్ ఫోటో కనిపించడంతో మొదట యాప్ లోపమని అనుకున్నాడు. కానీ కొద్ది సేపటికే వరుసగా కోహ్లీ నుంచి, ఏబీడీ కాల్స్ రావడం షురూ అయ్యింది. మొదట ఇదంతా సరదాగా తీసుకున్న మణీష్, పాటిదార్ చేసిన అభ్యర్థనను కూడా సరదాగా తిప్పికొట్టాడు. “నా పాత నంబర్ నీకు రీఅసైన్ అయింది, దయచేసి తిరిగి ఇవ్వు” అని పాటిదార్ చెప్పినప్పటికీ, అతను నమ్మలేదు. దీంతో పాటిదర్ మరో మార్గం లేదని భావించి, చివరికి పోలీసులను సంప్రదించాడు.

పోలీసులు మణీష్‌ను కలసి, ఈ నంబర్ నిజంగానే పాటిదార్ వాడినదని, కాల్స్ చేసిన వారు కోహ్లీ, ఏబీ డివిలియర్స్ నిజమైనవారేనని వివరించారు. అప్పుడే మణీష్‌కు మొత్తం విషయం అర్థమైంది. వెంటనే సిమ్‌ను పోలీసులకే ఇచ్చి, పాటిదర్ కు ఇష్టంతోనే హెల్ప్ చేశాడు. ఇక గ్రామంలో ఈ వార్త తెలిసిన వెంటనే అందరూ షాక్ అయ్యారు. మణీష్ దగ్గరకు వెళ్లి, అతని అనుభవం గురించి వినాలని ఆసక్తి చూపారు. ఒక్కసారిగా కోహ్లీ, ఏబీడీ, పాటిదార్‌లతో మాట్లాడిన అదృష్టం తనకే దక్కిందని మణీష్ ఆనందంగా చెప్పుకొచ్చాడు.