బాపట్ల క్వారీలో ఆరుగురి మృతి… విచారణకు బాబు ఆదేశం

ఏపీలోని బాపట్ల జిల్లాలో ఆదివారం ఓ ఘోర ప్రమాదం సంభవించింది. బాపట్ల జిల్లా బల్లికురువ మండల పరిధిలోని ఓ గ్రానైట్ క్వారీలో బండరాళ్ల కూలిన ఘటనలో ఆరుగురు కూలీలు ఆ బండల కింద పడి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు… ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ ప్రమాదం వివరాల్లోకి వెళితే… బల్లికురువ సమీపంలో సత్యకృష్ణ గ్రానైట్స్ సంస్థ ఓ క్వారీని నిర్వహిస్తోంది. ఇందులో పని చేసేందుకు ఒడిశా నుంచి కూలీలను ఆ సంస్థ రప్పించింది. అయితే క్వారీలో గ్రానైట్ తవ్వే సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలను పాటించడంలో కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలోనే ఆదివారం మొత్తం 16 మంది కార్మికులు పనిచేస్తుండగా… పై నుంచి బండ రాళ్లు ఉన్నట్టుండి విరిగి పడ్డాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు కూలీలకు అవకాశం లేకుండా పోయింది.

నేరుగా బండరాళ్లు మీద పడ్డ ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా… మిగిలిన పది మంది కూలీలకు బండరాళ్లు గట్టిగానే తగిలాయి. దీంతో వారు గాయపడ్డారు. గాయపడ్డ కూలీలకు యాజమాన్యం హుటాహుటీన నరసరావుపేట ఆసుపత్రికి తరలించింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలను వేగం చేశారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటన గురించి తెలుసుకున్న చంద్రబాబు షాక్ కు గురయ్యారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించిన చంద్రబాబు… క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.