‘ఐ ల‌వ్‌యూ’ చెప్ప‌డం త‌ప్పుకాదు: హైకోర్టు

ఐ ల‌వ్‌యూ.. త‌న ప్రేమ‌ను వ్య‌క్తీక‌రించేందుకు స‌హ‌జంగా యువ‌తీ యువ‌కులు చెప్పే మాట ఇది. అయితే.. ‘ఐల‌వ్ యూ అనే ప‌దాన్ని చాలా పెద్ద‌దిగా భావిస్తాం. ఒక ర‌కంగా.. ఇది ఎంతో ధైర్యం ఉంటే త‌ప్ప‌.. చెప్పే మాటగా కూడా ప‌రిగ‌ణించం. పైగా.. ఒక యువ‌తి లేదా.. బాలిక‌కు.. యువ‌కులు ‘ఐల‌వ్ యూ’ చెప్ప డాన్ని త‌ప్పుగా కూడా భావించే రోజులు ఉన్నాయి. పెద్ద‌లు దీనిని అస‌లు ఒప్పుకోరు. ఐల‌వ్ యూ అనేది బూతు కాక‌పోయినా.. ఇది అనేక ప‌ర్య‌వ‌సానాల‌కు దారితీస్తుంద‌న్న ఉద్దేశంతో దీనిని వ్య‌క్త ప‌రిచేందుకు ఎవ‌రూ సాహ‌సం చేయ‌రు.

దీనిని సంప్ర‌దాయానికి విరుద్ధంగా కూడా భావిస్తారు. పోలీసుల‌కు తెలిస్తే.. కేసులు కూడా పెడ‌తారు. పెడుతున్నారు కూడా. ఇప్ప‌టి వ‌రకు ఈ వ్య‌వ‌హారం.. వివాదంగానే ఉంది. ‘ఐల‌వ్ యూ’ చెప్ప‌డాన్ని స‌మాజం కూడా పెద్ద‌గా హ‌ర్షించ‌డం లేదు. ఏదైనా ఉంటే.. గుట్టుగా.. చాటుగానే.. చెప్పుకోవాలి. కానీ, అనూహ్యంగా.. ఈ విష‌యంలో ఛ‌త్తీస్‌గ‌ఢ్ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఐల‌వ్ యూ చెప్ప‌డాన్ని త‌ప్పుకాద‌ని తీర్పులో పేర్కొంది. అంతేకాదు.. దీనిపై ఆంక్ష‌లు కూడా ఉండ‌డానికి వీల్లేద‌ని పేర్కొంది.

రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 19(బీ) ప్ర‌కారం.. భావ‌ప్ర‌క‌ట‌న అనేది ప్ర‌తి ఒక్కరి ప్రాథ‌మిక హ‌క్కుగా ఉంద‌ని పేర్కొంది. విమ‌ర్శ‌లు ఎలానో.. సానుకూల వ్యాఖ్య‌లు కూడా అలానే చూడాల‌ని పేర్కొంది. ఐల‌వ్ యూ అనేది సానుకూల సంకేత‌మ‌ని.. ఒక వ్య‌క్తి.. మ‌రో వ్య‌క్తిపై వ్య‌క్త‌ప‌రిచే సానుకూల సంకేంతంలో ఇది కీల‌క భాగ‌మ‌ని తెలిపింది. ఐల‌వ్ యూ చెప్పినంత మాత్రాన‌.. త‌ప్పుకాద‌ని.. దీనిపై కేసులు పెట్టాల్సినంత అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది.

ఈ మేర‌కు స్థానిక కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టి వేస్తూ.. ఓ యువ‌కుడిని కేసు నుంచి విముక్తి చేసింది. స‌ద‌రు యువ‌కుడు కొన్నాళ్ల కింద‌ట‌.. 15 ఏళ్ల వ‌య‌సున్న బాలిక‌కు ఐల‌వ్ యూ చెప్పాడు. దీంతో ఆ బాలిక త‌ల్లిదండ్రుల‌కు చెప్ప‌గా.. వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో స‌హా.. ఇత‌ర చ‌ట్టాల కింద కేసు న‌మోదు చేసి.. యువ‌కుడిని అరెస్టు చేశారు. ఈ కేసును తాజాగా హైకోర్టు కొట్టి వేసి ఐల‌వ్ యూ చెప్ప‌డం త‌ప్పుకాద‌ని పేర్కొంది.