గత పది పదిహేనేళ్లలో ప్రపంచ క్రికెట్ ఎంతగా మారిపోయిందో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా టీ20 క్రికెట్ రంగ ప్రవేశంతో క్రికెట్ ఆడే తీరు, చూసే తీరు అన్నీ మారిపోయాయి. ఆటలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అభిమానుల్ని థ్రిల్ చేసేలా కొత్త రూల్స్ ప్రవేశ పెడుతూ ఆటను మరింత రసవత్తరంగా మారుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్స్‌ను ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆవిష్కరిస్తూనే ఉన్నారు.
ఐపీఎల్ తర్వాత ప్రపంచ క్రికెట్లో ఎక్కువ పాపులారిటీ ఉన్న టీ20 లీగ్ బిగ్ బాష్‌లో ఇప్పుడు సరికొత్త మార్పులు చూడబోతున్నాం. మ్యాచ్‌లను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు మూడు కొత్త మార్పులు ప్రవేశ పెట్టారు ఈ లీగ్‌లో.
ఇందులో ముందుగా చెప్పాల్సింది పవర్ సర్జ్ గురించి. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ మామూలుగా ఆరేసి ఓవర్ల పవర్ ప్లే ఉంటుందన్న సంగతి తెలిసిందే. దీంతో పాటుగా బ్యాటింగ్ జట్టు కోరుకున్న సమయంలో అదనంగా ఇంకో రెండు ఓవర్లు పవర్ ప్లే ఎంచుకోవచ్చు. పెద్ద హిట్టర్లు క్రీజులో ఉన్నపుడు, చివరి ఓవర్లలో ఈ రెండు ఓవర్ల పవర్ ప్లేను ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇక రెండో నిబంధన.. బాష్ బూస్ట్. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 10 ఓవర్లలో సాధించిన స్కోరు కంటే తర్వాతి బ్యాటింగ్ జట్టు 10 ఓవర్లలో ఎక్కువ స్కోరు చేస్తే అదనపు పాయింట్ వస్తుంది. అది నాకౌట్ దశ చేరేందుకు ఉపయోగపడుతుంది.
ఇది కాక ‘ఎక్స్ ఫ్యాక్టర్’ పేరుతో ఇంకో ఆకర్షణీయ మార్పు చేస్తున్నారీ లీగ్‌లో. 11 మంది తుది జట్టును ప్రకటించాక మ్యాచ్ మధ్యలో ఒక సబ్‌స్టిట్యూట్‌ను బ్యాటింగ్‌లో దించవచ్చు. ఈ మూడు నిబంధనలు కూడా బ్యాటింగ్‌కు అనుకూలించేవే. అభిమానులను ఆకర్షించేవే. బిగ్ బాష్ నుంచి ఇలాంటి కొత్త నిబంధనలను గతంలో ఐపీఎల్ అందిపుచ్చుకుంది. కాబట్టి మన లీగ్‌లో కూడా ఈ మార్పులు అమలయ్యే అవకాశాలు లేకపోలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates