2024 పుణేలో ఇద్దరి ప్రాణాలు బలితీసుకున్న పోర్షే కారు ప్రమాదానికి కారకుడైన 17 ఏళ్ల బాలుడిపై తిరిగి చర్చ మొదలైంది. బాలుడిని పెద్దవాడిగా (అడల్ట్) శిక్షించాలన్న డిమాండ్ పెరిగినా, జువెనైల్ జస్టిస్ బోర్డు మాత్రం తేల్చేసింది. అతడిపై నమోదైన కేసులు ఏదీ ఏడేళ్ల కంటే ఎక్కువ శిక్షను కలిగించేవి కావని పేర్కొంది. అందుకే, అతడిని మైనర్‌గానే విచారించాలని స్పష్టం చేసింది.
ఈ ఘటనలో బాలుడు మద్యం సేవించి దాదాపు 180 కిలోమీటర్ల వేగంతో బైక్‌ను ఢీకొట్టి ఇద్దరిని చంపేశాడు. కేసు నమోదు అయినా, అతడికి 15 గంటల్లో బెయిల్ మంజూరు కావడం పెద్ద దుమారానికి దారి తీసింది. అతడి తండ్రి ప్రఖ్యాత బిల్డర్ కాగా, తల్లి సహా తండ్రిని కూడా సాక్ష్యాల్ని తారుమారు చేసినందుకు అరెస్టు చేశారు.
ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ హిరాయ్ మాత్రం గట్టిగా వాదించారు. “ఈ ఘటన ఎంత దారుణంగా జరిగిందో చూడండి. పోలీసులు, వ్యవస్థను ప్రభావితం చేశారు, సాక్ష్యాలను మార్చేశారు. ఇవి బాలుడిలో ఉన్న పరిపక్వతను, క్రిమినల్ మైండ్‌ను సూచిస్తున్నాయి. ఇదే సందేశంగా ఉండాలంటే అతడిని అడల్ట్‌గా ట్రై చేయాలి” అని వాదించారు.
దీనికి బాలుడి తరఫు న్యాయవాది ప్రశాంత్ పాటిల్ వ్యతిరేకంగా స్పందించారు. సుప్రీం కోర్టు 2020లో ఇచ్చిన తీర్పును ఉదహరించి, ఏడేళ్లకంటే తక్కువ శిక్ష ఉన్న కేసులను ‘హీనియస్ క్రైమ్’గా పరిగణించలేమని స్పష్టం చేశారు. అలాగే మైనర్‌లను శిక్షించడం కాదు, మార్పు తేవడమే లక్ష్యమని జువెనైల్ న్యాయ చట్టం చెప్పిందని గుర్తు చేశారు.
జువెనైల్ బోర్డు చివరకు బాలుడిని అడల్ట్‌గా చూడడం సబబు కాదని తేల్చేసింది. అతడిపై నమోదైన సెక్షన్లు కలిపినా, ఏడేళ్ల శిక్ష గడువుకు రాకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. ఈ తీర్పుపై కొన్ని వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా, చట్టపరంగా మాత్రం ఇదే సరైన దిశగా కనిపిస్తోంది.
ఇకపై బాలుడిని మైనర్‌గానే విచారిస్తారు. అయితే, ఈ విషయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రాసిక్యూషన్ యోచనలో ఉంది. బాంబే హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates