డ్రాగన్ కు గట్టి దెబ్బ..రూ. 40 వేల కోట్లు నష్టం

దీపావళి పండుగ సందర్భంగా డ్రాగన్ దేశానికి చాలా గట్టి దెబ్బ తగిలింది. ప్రతి ఏడాది లాగే ఇపుడు కూడా పెద్ద ఎత్తున చైనా నుండి రకరకాల టపాకాయాలను మనదేశంలోకి దిగుమతి చేసింది. అయితే రెండు కారణాల వల్ల చైనా టపాకాయలను కొనటం తగ్గించేసరికి వేల కోట్ల రూపాయల బిజినెస్ పడిపోయింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటి) విడుదల చేసిన లెక్కల ప్రకారం చైనాకు ఈ దీపావళిలో సుమారు రూ. 40 వేల కోట్ల వ్యాపారం దెబ్బ తినేసిందట.

ప్రతి ఏడాది దీపావళంటేనే టపాకాయల మోతతో దేశం మోతెక్కిపోతుందన్న విషయం తెలిసిందే. పండగకు ముందు నాలుగు రోజులు తర్వాత నాలుగు రోజల పాటు మనదేశంలోని చాలా ప్రాంతాల్లో టపాకాయాలు కాలుస్తునే ఉంటారు. దీపావళికి కొనుగోలు చేసే టపాకాయల్లో దాదాపు 100 రకాలున్నాయి. ఒకపుడు ఈ టపాకాయాలన్నింటినీ తమిళనాడులోని శివకాశి నుండే కొనేవారు. తర్వాత్తర్వాత ఢిల్లీతో పాటు ఉత్తరాధి రాష్ట్రాల్లో కూడా తయారుచేయటం మొదలుపెట్టారు. దాంతో బిజినెస్ దేశవ్యాప్తంగా విస్తరించింది. ఏదేమైనా మనదేశంలో టపాకాయల బిజినెస్ ఒక్క దీపావళిని బేస్ చేసుకునే సుమారు 1.5 లక్షల కోట్లుంటుందని అంచనా.

మనదేశంలో టపాకాయాలకున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకున్న చైనా వీటి తయారీపై దృష్టి పెట్టింది. గడచిన పదేళ్ళుగా ఇటువంటి టపాకాయాలను తయారు చేయటంతో పాటు మరిన్ని కొత్త రకాలను తయారు చేసి మనదేశంలోకి దిగుమతి చేయటం మొదలుపెట్టింది. ఎవరు అంచనా వేయలనంతగా మనదేశంలో చైనా టపాకాయాలకు డిమాండ్ పెరిగిపోయింది. ఇందుకు కారణం ఏమిటంటే మనదేశంలో తయారయ్యే టపాకాయలకన్నా ధరలు తక్కువగా, నాణ్యతతో తయారు చేయటమే. దీంతో దేశవాళీ టపాకాయాల వ్యాపారం స్ధానంలో చైనా వ్యాపారం ఆక్రమించేసింది.

అలాంటిది తాజా దీపావళిలో సీన్ మొత్తం రివర్సయిపోయింది. పండగ సందర్భంగా చైనా నుండి సరుకు దిగుమతయినా జనాలు మాత్రం డ్రాగన్ టపాకాయలజోలికి వెళ్ళలేదట. ఎందుకంటే జమ్మూ-కాశ్మీర్ లో మనపై చైనా కాలుదువ్వుతు ఇబ్బందులు పెడుతోందన్న కోపం బాగా ఎక్కువైపోయిందట. అలాగే మనసైనికులను దొంగదెబ్బ తీసి చంపేసిందన్న మంట కూడా పెరిగిపోయిందట. దాంతో ఒక్కసారిగా దేశభక్తి పెరిగిపోవటంతో చైనా టపాకాయాల స్ధానంలో దేశవాళీ టపాకాయాలనే జనాలు ఎక్కువగా కొన్నారు. దాంతో డ్రాగన్ కు సుమారు రూ. 40 వేల కోట్ల వ్యాపారం దెబ్బతినేసింది.