ఈ బ్యాగ్ 65 కోట్లు!

పాతది, వాడినదే అయినా.. దానికి ధర మాత్రం ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ప్రముఖ ఫ్యాషన్ ఐకాన్ జేన్ బిర్కిన్ కోసం 1984లో ప్రత్యేకంగా తయారు చేసిన హెర్మెస్ బ్యాగ్ ఇటీవల ఊహించని ధరకు అమ్ముడై ఓ చరిత్ర సృష్టించింది. మచ్చలు నిండిన పురాతన శైలితో ఉన్న ఈ బ్లాక్ లెదర్ బ్యాగ్ చివరకు దాదాపు ₹65 కోట్లకు విక్రయమై చరిత్రలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌గా గుర్తింపు పొందింది.

పారిస్‌లో జరిగిన సోతెబై లీలామపటంలో ఈ బ్యాగ్‌ను వేలం వేసారు. ప్రారంభ ధరను €1 మిలియన్ (సుమారు ₹9 కోట్లు)గా ప్రకటించగా, కేవలం 20 నిమిషాల్లోనే అది ఏకంగా ₹85.7 కోట్లుకి చేరింది. చివరి బిడ్ జపాన్‌కు చెందిన కొనుగోలుదారు నుండి వచ్చినట్టు వెల్లడించారు, అయితే ఆయన వివరాలను గోప్యంగా ఉంచారు.

ఈ బ్యాగ్ వెనకున్న కథ మరింత ఆసక్తికరంగా ఉంది. 1980లలో లండన్‌కి వెళ్తున్న విమాన ప్రయాణంలో జేన్ బిర్కిన్ తన బుట్టను జాగ్రత్తగా తీసుకెళ్లుతూ Hermès CEO జీన్ లూయిస్ డ్యూమాస్‌ పక్కన కూర్చుంది. ఆమె భద్రతగా బ్యాగ్ అవసరం ఉందని గుర్తించిన డ్యూమాస్, ఓ విమాన సిక్ బ్యాగ్‌పై డిజైన్ స్కెచ్ చేశాడు. కొన్ని నెలల్లో ఆమెకు బ్యాగ్ సిద్ధమై వచ్చింది. అదే బ్యాగ్ ఈరోజు వేలంలో చరిత్ర సృష్టించింది.

ఇంతవరకూ వేలంలో అత్యధికంగా అమ్ముడైన హ్యాండ్‌బ్యాగ్‌ హిమాలయ క్రొకడైల్ బిర్కిన్ కాగా, దాని ధర 2022లో రూ. 3.7 కోట్లుగా నమోదైంది. కానీ జేన్ బిర్కిన్ బ్యాగ్ దానిని దాటి పదిరెట్లు ఎక్కువ ధరను పొందడంలో, దాని వెనక ఉన్న ఫ్యాషన్ చరిత్ర, ఆమె వ్యక్తిత్వం, హెర్మెస్ బ్రాండ్ విలువ కీలక పాత్ర పోషించాయి. వాస్తవానికి హెర్మెస్ బ్యాగ్‌లను సాధారణంగా కొనడం అంత తేలిక కాదు. కంపెనీ తమ ప్రత్యేక ఖాతాదారులకే ఆ ఛాన్స్ ఇస్తుంది. కానీ ఈ బ్యాగ్ మాత్రం ఒక యుగానికి ప్రతీకగా మారింది. ఇప్పుడు ఇది కేవలం హ్యాండ్‌బ్యాగ్ కాదు.. చరిత్రకు ఓ అద్దం.