హౌస్ ఫుల్ బోర్డులు… థియేటర్లు హ్యాపీ హ్యాపీ

నిన్న రాత్రి నుంచి ఏపీ తెలంగాణలో అఖండ 2 తాండవం థియేటర్లు జనాలతో నిండుగా కళకళలాడుతున్నాయి. సినిమా ఎలా ఉంది, రివ్యూలు, పబ్లిక్ రెస్పాన్స్ ఇవన్నీ కాసేపు పక్కనపెడితే ఎగ్జిబిటర్లు కొన్ని వారాల తర్వాత హౌస్ ఫుల్ బోర్డులు చూసుకుని మురిసిపోతున్నారు. ప్రీమియర్ షోలకు స్పందన బాగుండటంతో అర్ధరాత్రి దాకా ఆయా హాళ్ల దాకా సందడి నెలకొంది. లైసెన్స్ జరీలో కొంత ఆలస్యం జరగడం టెన్షన్ కలిగించినప్పటికీ నిమిషాల వ్యవధిలోనే నిర్మాతలు వాటిని పరిష్కరించడంతో అందరూ హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. అన్నీ దిగ్విజయంగా పూర్తయిపోయాయి.

ఒక మాస్ హీరో సినిమా వస్తే ఎలాంటి పండగ వాతావరణం ఉంటుందో అఖండ 2 మరోసారి నిరూపించింది. ఓజి తర్వాత అలాంటి సీన్లు మళ్ళీ బాక్సాఫీస్ దగ్గర కనిపించలేదు. మీడియం బడ్జెట్ హిట్లు వస్తున్నాయి కానీ బిసి సెంటర్ల ఫీడింగ్ కి అవి సరిపోలేదు. దీంతో అందరి చూపు అఖండ 2 మీదే ఉంది. డిసెంబర్ 5 వాయిదా పడటం ఆశనిపాతంగా మారితే వారం రోజుల్లోనే తిరిగి విడుదలకు మార్గం సుగమం చేసుకోవడం మంచి పరిణామం. కేవలం నైజాం ప్రీమియర్ల నుంచే రెండున్నర కోట్ల దగ్గరగా వసూలు కాగా సీడెడ్ లోనూ ఇంచుమించు అదే నెంబర్ కనిపిస్తోంది. ఇప్పుడు దీన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత టాక్ మీద ఉంది.

వీకెండ్ అయితే కానీ అఖండ 2 స్టామినా ఎంతనేది చెప్పలేం. మార్కెట్ లో పెద్దగా కాంపిటీషన్ లేదు. మోగ్లీని బాగానే ప్రోమోట్ చేస్తున్నారు కానీ రేపు రిలీజ్ కాబట్టి దానికొచ్చే రిపోర్ట్స్ ఎలా ఉన్నా బాలయ్యకు పోటీ ఇచ్చే రేంజ్ అయితే కాదు. అఖండ 2కి ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ మరింత మెరుగు పడాల్సిన అవసరమయితే కనిపిస్తోంది. ఫ్యాన్స్ హ్యాపీగానే ఉన్నారు కానీ సాధరణ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దాని మీద ఫలితం ఆధారపడి ఉంది. ఇలాంటి సినిమాలకు అది ఒకటి రెండు షోలతో తేలదు. సోమవారం దాకా వేచి చూస్తే స్పష్టత వస్తుంది. అప్పటిదాకా అభిమానులు వెయిట్ చేయాల్సిందే.