ఈసారి వేలంలో సెహ్వాగ్, కోహ్లీ వారసులు

డిల్లీలో నిర్వహించనున్న DPL 2025 టోర్నీకి సంబంధించిన ఆటగాళ్ల వేలం క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. కానీ ఈసారి స్టార్ ఆటగాళ్ల కన్నా ఎక్కువగా చర్చకు వస్తున్న వారసుల పేర్లు కూడా ఉన్నాయి. అందులో ఇద్దరు యువ ఆటగాళ్లు వేలంలో ప్రత్యేకంగా నిలిచారు. వీరిలో ఒకరు వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు కాగా, మరొకరు విరాట్ కోహ్లీ అన్న కుమారుడు. ఇద్దరూ చిన్నతనంలో నుంచే క్రికెట్‌లో రాటు దేలుతూ ఇప్పుడు ప్రొఫెషనల్ లీగ్ వేదికగా తమ తొలి అడుగులు వేయనున్నారు.

సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా తండ్రి అడుగుజాడలో నడుస్తున్నాడు. అతడిని కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు పోటీపడగా, చివరకు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ జట్టు రూ. 8 లక్షలు వెచ్చించి సొంతం చేసుకుంది. మరోవైపు, కోహ్లీ అన్న కొడుకు ఆర్యవీర్ కోహ్లీ మాత్రం లెగ్ స్పిన్నర్. అతడిని సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ రూ. 1 లక్షకు తీసుకుంది. ఆయనకు కోచ్‌గా టీమిండియాకు విరాట్ కోహ్లీని అందించిన రాజ్‌కుమార్ శర్మ ఉండటం మరో విశేషం.

ఈ వేలంలో సిమర్‌జీత్ సింగ్ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. అతడిని సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ జట్టు రూ. 39 లక్షలు వెచ్చించి దక్కించుకుంది. అలాగే మిస్టరీ స్పిన్నర్ దిగ్వేశ్ సింగ్ రాఠీ రూ. 38 లక్షలకు సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ జట్టులోకి వచ్చాడు. ఇద్దరూ తమ ఐపీఎల్ ప్రదర్శనలతో ఇప్పటికే ఆకట్టుకున్నారు.

ఇప్పటికే సీనియర్ స్థాయిలో తళుక్కుమన్న ఆటగాళ్లు మరోవైపు ఉంటే.. క్రికెట్ లెజెండ్ల వారసులు డీపీఎల్‌లో ఎలాంటి ప్రతిభ కనబరుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పేరు, పరిచయాల వల్ల వచ్చిన హైప్‌ను అనుభవంగా మార్చగలరా? అనేది డీపీఎల్ వేదికగా తేలనుంది. ఇక డిల్లీలో పుట్టిన వీరు, దేశవ్యాప్తంగా ఎంత గుర్తింపు తెచ్చుకుంటారో వేచి చూడాలి.