బీరు తాగుతూ వాదనలు వినిపించిన లాయర్‌..

గత కొన్ని సంవత్సరాలుగా కోర్టుల పని తీరులో సాంకేతిక మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. వర్చువల్ విధానంలో విచారణలు నిర్వహించడం కోర్టులకు రోజువారీ వ్యవహారంగా మారుతోంది. అయితే ఈ సౌకర్యాన్ని కొందరు న్యాయవాదులు సరిగ్గా వినియోగించకపోవడమే కాకుండా, విపరీతంగా వ్యవహరిస్తుండటం ఆందోళన కలిగించే విషయం. గుజరాత్ హైకోర్టులో ఇటీవలి ఘటన అందుకు నిదర్శనంగా నిలిచింది. 

ఒక సీనియర్ న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తున్న సమయంలో బీరు తాగుతూ కనిపించడం కోర్టు విలువలను లెక్క చేయకపోవడం హాట్ టాపిక్ గా మారింది. జూన్ 26న జస్టిస్ సందీప్ భట్ నేతృత్వంలో గుజరాత్ హైకోర్టులో జరుగుతున్న కేసులో పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది భాస్కర్ తన్నా, వర్చువల్ ద్వారా వీడియో కాల్‌లో బీరు తాగుతూ వ్యవహరించడం తీవ్ర సంచలనానికి దారితీసింది. 

ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో బయటకు రావడంతో న్యాయవ్యవస్థ పరువు నిలిపే అంశంగా వైరల్ అయ్యాయి. ఒక వైపు కోర్టు సమయాన్ని గౌరవించేలా న్యాయవాదులు ఆచరణలో ఉండాలని అంచనాలు ఉండగా, ఇలా మర్యాదలు విస్మరించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

ఈ వ్యవహారంపై కోర్టు కూడా తక్షణంగా స్పందించింది. సీనియర్ న్యాయవాది హోదాలో ఉన్న వ్యక్తిగా భాస్కర్ తన్నా వ్యవహరించిన తీరు న్యాయవ్యవస్థపై మచ్చవేసిందని ధర్మాసనం అభిప్రాయపడింది. వర్చువల్ వేదికపై ఇలాంటి ప్రవర్తన ఏమాత్రం కరెక్ట్ కాదని పేర్కొంది. ఇక నుంచి ఆయన వర్చువల్ వాదనలకు అనుమతి ఇవ్వబోమని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ అంశంపై సుమోటోగా కేసు నమోదు చేసి రెండు వారాల తర్వాత వాదనలు వినిపిస్తామని వెల్లడించింది.

అంతేకాదు, ఈ వ్యవహారంపై పూర్తి నివేదికను రూపొందించి సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు ఆధారంగా భాస్కర్ తన్నా సీనియర్ న్యాయవాది హోదాను తిరిగి పరిశీలించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఇది న్యాయవాదులకు తగిన హెచ్చరికగా మారే అవకాశం ఉంది.