అగ్రరాజ్యం అమెరికా అంటేనే ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలకు కలల దేశం. మెరుగైన జీవనవేగం కోసం, సంపద కోసం, భవిష్యత్తు కోసం వేలాదిమంది అక్కడికి వెళ్లాలని అనుకుంటున్నారు. అయితే అమెరికాలోకి నేరుగా వీసాలు లేకుండా ప్రవేశించడం నేరం. అయినా మన దేశం నుండి, ముఖ్యంగా గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి చాలా మంది ఈ ప్రయాణాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా విడుదలైన అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ నివేదిక ప్రకారం.. 2025లో జనవరి నుండి మే మధ్యవరకూ 10,382 మంది భారతీయులు అక్రమంగా ప్రవేశించేందుకు యత్నిస్తూ పట్టుబడ్డారు. వీరిలో 30 మంది మైనర్లు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది ఇదే సమయానికి 34 వేల మందికిపైగా అరెస్టయిన సంగతి తెలిసిందే.
ఈ సంవత్సరం ఈ సంఖ్యలో 70 శాతం తగ్గుదల కనిపించడంతో, ట్రంప్ పాలనలో భద్రతా చర్యలు ఎంత కఠినమయ్యాయో తెలుస్తోంది. గతంలో రోజుకు సగటున 230 మంది భారతీయులను అరెస్ట్ చేస్తే, ఇప్పుడది 69కి తగ్గింది. ట్రంప్ మళ్లీ అధికారంలోకి రావడం, హారిస్ ఓటమి ఖాయమని భావించిన సందర్భం నుంచే మానవ అక్రమ రవాణా ముఠాలు తమ కార్యకలాపాలను తగ్గించుకున్నట్లు పత్రికలు వెల్లడించాయి.
ఇక, 2024 ఆర్థిక సంవత్సరానికి గాను 500 మంది మైనర్ బాలబాలికలను తల్లిదండ్రులు వదిలేసిన కేసులు వెలుగుచూశాయి. తమ పిల్లలకైనా పౌరసత్వం దక్కుతుందన్న ఆశతో ఇలా విడిచి వెళ్తున్నారు. వీరిని అమెరికా అధికారులు అదుపులోకి తీసుకుంటున్నారు. చాలా మంది పిల్లలు 12 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్నవారే. అతి కొద్దిమంది మాత్రం చిన్న వయస్సులోనే ఈ ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకుంటున్నారు.
అలాగే అక్రమ వలస దారుల భయంకర ప్రయాణాల కథలు మనసును కలచివేస్తున్నాయి. మే 9న కాలిఫోర్నియాలో ఓ పడవ బోల్తాపడి, భారత్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు, 10 ఏళ్ల బాలిక మరణించారు. అన్నా-చెల్లెళ్లు అయిన ఈ చిన్నారులు మెక్సికో నుంచి బోటులో సముద్రం దాటుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇది ఒకటి కాదు.. ఇలాంటివి అనేకం జరుగుతూనే ఉన్నాయి.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ లెక్కల ప్రకారం అమెరికాలో ప్రస్తుతం సుమారు 2.2 లక్షల మంది భారతీయులు డాక్యుమెంట్లు లేకుండా జీవిస్తున్నారు. 2025 ప్రారంభం నుంచి ఇప్పటివరకు 332 మందిని మాత్రమే వెనక్కి పంపగలిగారు. ఇది చాలా తక్కువ సంఖ్య. అయినప్పటికీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. అవకాశాల కోసం అమెరికాకు వెళ్లాలనుకోవడం తప్పు కాదు.. కానీ ప్రాణాలను ఫణంగా పెట్టి, పిల్లలను ప్రమాదంలో నెట్టడం నిజంగా బాధాకరం.
Gulte Telugu Telugu Political and Movie News Updates