ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుని రథయాత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏటా ఆషాధ శుద్ధ విదియ తిథి నుంచి 12 రోజులు జరిగే ఈ రథయాత్రకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తారు. అశేష జనంతో పూరీ కిటకిటలాడుతుంది. ఈ ఏడాది కూడా అలానే జరిగింది. అయితే.. గతంలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఉన్నప్పుడు.. కొన్ని ఆంక్షలు విధించేవారు. ఈ సారి బీజేపీ సర్కారు ఎలాంటి ఆంక్షలు లేకుండానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
దీంతో లక్షల సంఖ్యలో వచ్చిన భక్తుల భద్రతకు ప్రాధాన్యం లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తు న్నాయి. రథయాత్రలో కీలక ఘట్టమైన.. గుండిచా ఆలయం వద్దకు మూడు రథాలు చేరుకున్న తర్వాత.. ఆయా రథాల్లోని మూర్తులను దర్శించుకునేందుకు భక్తులు భారీగా ఎగబడ్డారు. గతంలో దీనిని ఓ క్రమ పద్ధతిలో చేసేవారని స్థానికులు మీడియాకు తెలిపారు. ఈ దఫా ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో మూర్తులను దర్శించుకునేందుకు వచ్చిన వారు ఒకరిపై ఒకరు తోసుకున్నారు.
దీంతో తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈఘటన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగానే భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ వ్యవహారంపై బీజేపీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. వెంటనే బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు.. ఆసుపత్రులకు తరలించింది. ఇదిలావుంటే.. ఏటా జరిగే జగన్నాథుని రథయాత్రలో గతంలో ఎప్పుడూ మరణాలు చోటు చేసుకోలేదని.. ప్రభుత్వమే జాగ్రత్తలు తీసుకుందని ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్న బీజేడీ నాయకులు విమర్శలు గుప్పించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates