భారత వ్యోమగామి శుభాంశు శుక్లా… అంతరిక్షంలో ఉన్న తన అనుభూతులను ప్రత్యక్షంగా లైవ్ కాల్ ద్వారా మొదటిసారి షేర్ చేసుకున్నారు. ఆయన ప్రస్తుతం యాక్సియం-4 మిషన్‌లో భాగంగా భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) చేరే ముందు తొలిసారిగా లైవ్ కాల్ ద్వారా మాట్లాడిన శుభాంశు, తన అనుభవాలను ఎంతో ఎమోషనల్‌గా, శ్రద్ధతో వివరించారు.
“ఇది అద్భుతమైన ప్రయాణం. నేను ఇప్పుడు భారరహిత స్థితికి అలవాటు పడటం కొత్త అనుభవం. ఓ చిన్నపిల్లాడిలా నడవడం, తినడం నేర్చుకుంటున్నా” అని శుభాంశు తన మాటల్లో చెప్పారు. ఆయన తాను ఒక్కడిననే అనిపించుకోలేదని, తన భుజంపై ఉన్న త్రివర్ణ పతాకం చూసినప్పుడు కోట్లాది భారతీయులు తన వెంట ఉన్నారనే భావన కలుగుతోందన్నారు. ఇది తనకు ఒక గొప్ప బలం ఇస్తోందని తెలిపారు.
అంతరిక్షానికి వెళ్లిన తర్వాత శుభాంశు మాట్లాడుతూ… ‘‘ఈ ప్రయాణానికి తోడుగా వచ్చిన జాయ్ అనే హంస బొమ్మను కూడా తీసుకొచ్చాం. భారతీయ సంస్కృతిలో హంస విజ్ఞానానికి చిహ్నం. ఇది మా మిషన్‌కు ఒక ప్రేరణలా ఉంటుంది,’’ అన్నారు. ఇక 30 రోజుల క్వారంటైన్ అనంతరం, అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడం తన జీవితంలోని గొప్ప ఘట్టమన్నారు. ఈ ప్రయాణానికి సహకరించిన ప్రతీ ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
41 ఏళ్ల విరామం తర్వాత భారతదేశం తరఫున మరోసారి ఓ వ్యోమగామి అంతరిక్షంలో అడుగుపెడుతుండటం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని విశ్లేషకులు పేర్కొంటున్నారు. శుభాంశు చేసిన లైవ్ కాల్ దేశమంతా గర్వపడేలా చేసింది. ISS చేరిన తర్వాత శుభాంశు సహా మిగిలిన ముగ్గురు వ్యోమగాములు 14 రోజుల పాటు ఉండి కీలక పరిశోధనల్లో పాల్గొననున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates