నిత్యానంద ఏ ‘దేశంలో’ ఉన్నారో చెప్పేసిన శిష్యురాలు

వివాదాస్పద ఆధ్యాత్మిక నాయకుడు నిత్యానంద ఎక్కడున్నారనే సందేహాలకు తాజాగా ఒక సమాధానం లభించింది. మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం విచారిస్తున్న కేసులో, నిత్యానంద శిష్యురాలు అర్చన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం, నిత్యానంద ప్రస్తుతం ఆస్ట్రేలియా సమీపంలోని “యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస” అనే ప్రత్యేక దేశంలో ఉంటున్నారట. ఈ సమాచారం ధర్మాసనంలో చర్చకు దారి తీసింది.

మదురై ఆధీనం మఠంలోకి నిత్యానంద ప్రవేశించకుండా 2022లో ఇచ్చిన తాత్కాలిక నిషేధ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన తరఫున అప్పీల్ దాఖలైంది. విచారణ సందర్భంగా కోర్టు పలు ప్రశ్నలు రాసుకుంది. “నిత్యానంద ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆయన చెబుతున్న కైలాస దేశం నిజంగానే ఉందా? అక్కడికి వెళ్లాలంటే వీసా అవసరమా?” అనే ప్రశ్నలు సంధించింది. దీనికి సమాధానంగా అర్చన – నిత్యానంద ఆస్ట్రేలియా పక్కనే స్థాపించిన ‘కైలాస’ అనే దేశంలో ఉన్నారని ధృవీకరించారు.

ఈ ప్రకటనతో నిత్యానంద ఉనికి గురించి ఇప్పటికే నెలకొన్న అనుమానాలకు కొంత మేర సమాధానం దొరికినట్టే. అయితే ఆయన స్థాపించిన ఈ ‘దేశం’ను అంతర్జాతీయంగా ఏ దేశమూ గుర్తించకపోవడం మరో ప్రస్తావనగా నిలుస్తోంది. గతంలో నిత్యానంద తన ‘కైలాస’ను ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించి, క్యాబినెట్, జెండా, కరెన్సీ వంటి అంశాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.

నిత్యానంద తరఫున న్యాయవాదిని మారుస్తున్నట్లు కూడా శిష్యురాలు ధర్మాసనానికి తెలిపారు. దీనికి కోర్టు అనుమతిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ పరిణామంతో నిత్యానంద పేరు మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది. ఆయన మళ్లీ పబ్లిక్‌గా కనిపించకపోయినా, కోర్టు వేదికపై వెలువడిన సమాచారం వల్ల చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి.

ఆధ్యాత్మికత పేరుతో ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న నిత్యానంద.. దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత కూడా వార్తల్లోనే నిలుస్తున్నారు. ఇప్పుడు ఆయన ఆచూకీపై కొంత స్పష్టత వచ్చినప్పటికీ, ఆయన స్థాపించిన కైలాసకు చట్టబద్ధ గుర్తింపు ఉందా? లేదా? అనే ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. అయితే నిత్యానంద కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున, తదుపరి విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.