ఇంకా నయం.. హనీమూన్‌కు తీసుకెళ్లి చంపలేదు!

ఉత్తర్ ప్రదేశ్‌లోని బదాయూ జిల్లాలో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది. పెళ్లయిన కొత్తలోనే భార్య ప్రియుడితో పారిపోయింది. అయితే దీనిపై భర్త స్పందించిన తీరు సంచలనంగా మారింది. “హనీమూన్‌కు తీసుకెళ్లి రాజా రఘువంశీలా హత్య చేయలేదని బతికి బయటపడ్డాను” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన ఇటీవల మెఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసును మరోసారి గుర్తు చేస్తోంది.

మే 17న సునీల్ అనే యువకుడికి స్థానికంగా 20 ఏళ్ల యువతితో పెళ్లి జరిగింది. అయితే ఆమె కేవలం తొమ్మిది రోజులకే పుట్టింటికి వెళ్ళినట్టు చెప్పి, అక్కడి నుంచే ప్రియుడితో పారిపోయింది. భార్య కనిపించకపోవడంతో సునీల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ ప్రారంభించిన సమయంలో ఆ యువతి స్వయంగా తన ప్రియుడితో కలిసి పోలీసుల ముందుకు వచ్చింది. తాను అతనితోనే జీవించాలనుకుంటున్నానని స్పష్టం చేసింది.

ఈ విషయాన్ని అంగీకరించిన సునీల్ మీడియాతో మాట్లాడుతూ “ఇంకా నయం.. హనీమూన్‌కు తీసుకెళ్లి చంపలేదు. నేను హనీమూన్‌కు ప్లాన్ చేసినా, ఆమె అప్పటికే పారిపోయింది. లేకపోతే మరొక రాజా రఘువంశీలా నేను కూడా హతమయ్యేవాడిని. బతికిపోయాను అనిపిస్తుంది” అని చెప్పడం ఆసక్తికరంగా మారింది. అతని స్పందనలో బాధ కన్నా ఉపశమనమే ఎక్కువగా కనిపించింది.

ఇరు కుటుంబాలు పరస్పర అంగీకారంతో విడిపోయాయి. పెళ్లి సమయంలో ఇచ్చిన నగలు, కానుకలను వెనక్కు తీసుకున్నాయి. వివాదం పెద్దగా కావడం లేదని, ఫిర్యాదు ఉపసంహరించడంతో చట్టపరంగా ఎలాంటి చర్యలు అవసరం కాలేదని బిసౌలీ పోలీసు అధికారి హరేంద్రసింగ్ తెలిపారు. ఇటీవలి కాలంలో ప్రేమ, వివాహాల నేపథ్యంలో వచ్చే మోసాలు, హత్యలు ఎక్కువవుతున్నాయి. కానీ ఈ ఘటనలో విషాదం జరగకుండానే ముగిసిన తీరు, సునీల్ స్పందన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.