ఇరాన్ – ఇజ్రాయిల్.. వాట్సాప్ తో హత్యలా?

ఇరాన్‌లో కీలక వ్యక్తులపై జరుగుతున్న సుతిమెత్తని హత్యల వెనక డిజిటల్ సమాచారమే కారణమా? ఇదే ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. తాజా వివాదంలో ఫోకస్ గా మారింది వాట్సాప్ యాప్. ఈ యాప్ ద్వారా వినియోగదారుల డేటా ఇజ్రాయిల్ ఆర్మీకి లీకవుతోందన్న అనుమానాల నేపథ్యంలో.. ఇరాన్ ప్రభుత్వం ప్రజలను వాట్సాప్ తొలగించమంటూ పిలుపునిచ్చింది.

ఇరానియన్ ప్రభుత్వ టీవీ ప్రసారం చేసిన ఓ ప్రకటనలో, వాట్సాప్ యాప్ వినియోగదారుల సమాచారం సేకరించి ఇజ్రాయిల్‌కు అందిస్తోందని ఆరోపణలు వచ్చాయి. అయితే ఇది ఇప్పటిదాకా అధికారికంగా నిరూపించబడలేదు. అయినా, ఇటీవలి కాలంలో ఇరాన్‌కు చెందిన కీలక వ్యక్తుల ప్రాణాలపై జరిగిన దాడుల అచ్చుతప్పు స్థితిగతులను చూస్తే, ఈ అనుమానాలు ఏ మాత్రం తేలికగా తీసుకునేలా లేవు.

దీనిపై వాట్సాప్ సంస్థ అయిన మెటా స్పష్టమైన స్పందన ఇచ్చింది. “ఇది పూర్తిగా తప్పుడు ఆరోపణ. మేము ఎక్కడా వినియోగదారుల ఖచ్చితమైన లోకేషన్ ట్రాక్ చేయం, వారి సందేశాల లాగ్‌లు ఉంచం. మేము ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారన్నది కూడా గమనించం,” అని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అంతేకాదు, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్‌ ఉన్న మాధ్యమం కాబట్టి సందేశాన్ని పంపినవాడి నుండి స్వీకరించినవాడికే తెలుస్తుందని స్పష్టం చేశారు.

అయితే, సైబర్ భద్రతా నిపుణులు దీన్ని సంపూర్ణ భద్రతగా పరిగణించడం లేదు. మెటాడేటా అనే సమాచారం, అంటే సందేశం ఎప్పుడు పంపబడింది, ఎవరి ఫోన్‌కి వెళ్లింది వంటి విషయాలు కొన్ని సందర్భాల్లో బయటపడే అవకాశముంటుందని హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో అమెరికా టెక్ కంపెనీలు ఇజ్రాయిల్ ప్రభుత్వానికి సహకరిస్తున్నాయన్న ఆరోపణలు కూడా గతంలో రాగా, వాటిపై కంపెనీలు మాత్రం ఎప్పుడూ నిరాకరణ తెలిపాయి.

ఇకపోతే, ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ కంపెనీ అభివృద్ధి చేసిన పెగాసస్ స్పైవేర్ ద్వారా వాట్సాప్ వంటి యాప్‌లను హ్యాక్ చేయడం ఇప్పటికే న్యూస్‌ల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ గతంలో న్యూయార్క్ కోర్టులో ఎన్‌ఎస్‌ఓపై కేసు కూడా వేసిన విషయం తెలిసిందే. ఈ వివాదం మరోసారి డిజిటల్ ప్రైవసీపై ప్రపంచాన్ని ఆలోచింపజేస్తోంది.