కెప్టెన్సీ అవకాశాన్ని వదులుకోవడంపై స్పందించిన బుమ్రా

ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు ముందుగా బుమ్రా కెప్టెన్ అవుతాడనే ఊహాగానాలు గట్టిగానే పుట్టుకొచ్చాయి. కానీ ఆకస్మికంగా శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ప్రకటించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే బుమ్రాకు పగ్గాలు ఎందుకు ఇవ్వలేదనే విషయంలో చాలా రకాల వార్తలు వచ్చాయి. ఇక ఫైనల్ గా ఇప్పుడు జస్ప్రిత్ బుమ్రా తన వివరణ అయితే ఇచ్చాడు.

ఈ మధ్యే దినేష్ కార్తీక్‌తో జరిగిన ఇంటర్వ్యూలో బుమ్రా స్పందించాడు. “బీసీసీఐ నాకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని భావించింది. అజిత్ అగార్కర్ ఆధ్వర్యంలోని సెలెక్షన్ కమిటీ ఈ విషయాన్ని నాతో చర్చించింది. కానీ నేను అందుకు ‘నో’ చెప్పాల్సి వచ్చింది. ఇది జట్టు ప్రయోజనాల దృష్ట్యా సరికాదని భావించాను,” అని బుమ్రా వివరించాడు.

తన వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ దృష్ట్యా ఐదు టెస్టుల సిరీస్‌ను పూర్తిగా ఆడటం కష్టమని, మధ్యలో జట్టుకు మార్పులు వస్తే ఆటగాళ్లపై ప్రభావం పడుతుందని బుమ్రా అభిప్రాయపడ్డాడు. “ఒక సిరీస్‌లో మూడింటికి నేను లీడ్ చేస్తే, ఇంకో రెండింటికి ఇంకెవరో లీడ్ చేస్తే అది జట్టు పట్ల న్యాయంగా ఉండదు. కాబట్టి జట్టు అవసరాలకే ప్రాధాన్యం ఇచ్చాను,” అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

ఈ నేపథ్యంలోనే శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. రిషభ్ పంత్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. బుమ్రా దృక్పథాన్ని బట్టి చూస్తే, తన ఆరోగ్యం, ఆట స్థిరతపై దృష్టి పెట్టాలన్న ఆలోచన స్పష్టంగా తెలుస్తోంది. అదే సమయంలో జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేసినట్టు చూపించాడు. ఇప్పటికే బుమ్రా భారత్‌కు ఎన్నో విజయాలు అందించిన స్టార్ పేసర్. తన కెరీర్‌ను పొడగించుకునే లక్ష్యంతో కెప్టెన్సీ వదిలేసిన ఈ నిర్ణయం పట్ల క్రికెట్ వర్గాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జట్టు కోసం తాను ఎంత త్యాగం చేయగలడో మరోసారి నిరూపించాడు బుమ్రా.