బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద RCB విజయోత్సవాల్లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఈ విషాద ఘటనపై ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సామాన్యుడి ప్రాణం.. చాయ్ కంటే ఛీపా అంటూ హర్ష్ గోయెంకా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో కొన్ని సంఘటనలను గుర్తు చేస్తూ గుండెను కలచివేసే విధంగా స్పందించారు.
ఢిల్లీ రైల్వే స్టేషన్, కుంభమేళా, ఇప్పుడు బెంగళూరు.. ప్రతీ చోటా సామాన్యులపై నిర్లక్ష్యమే ప్రాణాల నష్టానికి కారణమవుతుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. “ఒక కప్పు చాయ్‌కి ఉన్న విలువ, మన దేశంలో సామాన్యుడి ప్రాణానికి లేదంటే ఎంత దుర్మార్గమో?” అని వేదనతో ప్రశ్నించారు.
ఇలాంటి ఘటనల తర్వాత కూడా ఎవరూ ఎలాంటి బాధ్యత తీసుకోకపోవడంతో మనలో నేర్చుకునే తత్వం లేదన్నట్లు మండిపడ్డారు. ప్రజల ప్రాణాలకు విలువ లేదనే బలమైన విమర్శలు ఆయన ట్వీట్ ద్వారా వ్యక్తమయ్యాయి. ఇది ఒక్క ట్వీట్ కాదని, ప్రజల ఆత్మవేదనకు ప్రతినిధిగా నిలుస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
గోయెంకా పోస్ట్‌కు నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. ప్రభుత్వాలు భద్రతా ఏర్పాట్లపై నిర్లక్ష్యంగా ఉంటే ఇలానే జరుగుతుంది.. అని కొందరు వ్యాఖ్యానించగా, అభిమానులే అప్రమత్తంగా ఉండాలి.. అని మరికొందరు సూచించారు. కానీ వ్యవస్థపైనే ప్రశ్నలు వేయడం తప్పు కాదని చాలా మంది స్పష్టం చేశారు. అలాగే ఇలాంటి సంఘటనల తర్వాత బాధ్యత తీసుకొని చర్యలు తీసుకుంటే, భవిష్యత్తులో ప్రాణనష్టం తగ్గుతుందని మరికొందరు ప్రముఖులు సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates