కొలోన్ నగరంలో భద్రతాధికారులు తాజాగా మూడు పురాతన బాంబులను గుర్తించడం స్థానిక ప్రజల్లో కలకలం రేపుతోంది. రెండవ ప్రపంచ యుద్ధానికి చెందిన ఈ బాంబులు నాజీ పాలనలో జర్మనీపై మిత్రదేశాలు వేశినవిగా గుర్తించారు. రెండు బాంబులు వెయ్యి కిలోల బరువులో ఉండగా, మూడవది 500 కిలోల బరువు కలిగి ఉందని అధికారులు వెల్లడించారు. ఈ వార్త వెలువడగానే కొలోన్‌లోని ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు.
అత్యంత అప్రమత్తంగా స్పందించిన స్థానిక ప్రభుత్వం, వెంటనే 20 వేల మందికి పైగా ప్రజలను సమీప ప్రాంతాల నుంచి తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలకు తరలించింది. ప్రార్థనా మందిరాలు, క్రీడా మైదానాలు, హాలులు ఈ విధంగా సిద్ధం చేయబడ్డాయి. బాంబులు దొరికిన ప్రాంతాన్ని ఒక కిలోమీటరు పరిధిలో ఖాళీ చేయగా, ప్రత్యేక బాంబు నిర్వీర్యకరణ నిపుణుల బృందాలు అక్కడి పని చేపట్టాయి.
బాంబులు ఎప్పుడైనా పేలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించగా, కొలోన్ నగరానికి వచ్చే కొన్ని ప్రధాన రవాణా మార్గాలను మూసివేశారు. మిలిటరీ, అంబులెన్స్, ఫైర్ సర్వీస్ బృందాలను భారీగా మోహరించారు. బాంబు పరిధిలోని భవనాల్లో గాజు చుట్టూ రక్షణ చర్యలు తీసుకుంటూ, ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇలాంటివి కొత్తేమీ కావు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన 80 ఏళ్ల తర్వాత కూడా జర్మనీలో పేలని బాంబులు బయటపడుతూనే ఉన్నాయి. 2017లో ఫ్రాంక్‌ఫర్ట్‌లో లభ్యమైన 1.4 టన్నుల బాంబు ఘటన పెద్ద దుమారం రేపింది. 2024లో ఇప్పటివరకు 30కు పైగా బాంబులు బయటపడగా, జర్మనీ అంతటా సుమారు 15 లక్షల బాంబులు వేశారని, అందులో 20 శాతం పేలకుండా మిగిలిపోయాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటన మరోసారి యుద్ధపు భయానక ఫలితాలను గుర్తు చేస్తోంది. ఎన్నో సంవత్సరాలు గడిచినా అప్పటి ఉగ్ర మార్గాలు ఇప్పటికీ మానవాళిని కలవరపెడుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates