టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ ఇటీవల భారత్ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హిందూ ధర్మం పట్ల ఉన్న ఆకర్షణను బయటపెట్టారు. ప్రాచీన భారత సాంస్కృతిక వారసత్వంపై తనకున్న అభిమానం, భారతీయ ఆధ్యాత్మికతపై తన గౌరవాన్ని ఆయన వెల్లడించారు. “ప్రపంచమంతా శివుడిని అనుసరిస్తే బాగుండేది. నేను నిపుణుడిని కాను, కానీ ఈ ధర్మం పట్ల నాకు ఆసక్తి ఉంది. ఇది చాలా పురాతనమైనది. మనం ఎంత తక్కువ తెలుసుకున్నామో ఇది చెబుతుంది” అని ఎర్రోల్ మస్క్ పేర్కొన్నారు.
ఇలాంటి వ్యాఖ్యలతో ఆయన హిందూ ధర్మం పట్ల ఉన్న గౌరవాన్ని వ్యక్తీకరించారు. భారతీయ ఆధ్యాత్మికత ప్రపంచానికి మార్గదర్శకంగా ఉండగలదని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, భారత్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక శక్తిని ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని పరోక్షంగా తెలిపారు. శివ తత్త్వం పట్ల ఆయన ఆసక్తి భారతీయ సంప్రదాయాల పట్ల ఉన్న గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది.
ఈ సందర్బంగా ఆయన టెస్లా కంపెనీ, భారత్ మధ్య ఉన్న సంబంధాల గురించి కూడా మాట్లాడారు. “భారత్‌లో టెస్లా తయారీ కేంద్రం ఖచ్చితంగా ఏర్పడుతుంది. ప్రధానమంత్రి మోదీ గారు మరియు ఎలాన్ మస్క్ ఈ విషయంలో కలిసి పని చేస్తారని నాకు నమ్మకం ఉంది” అని ఎర్రోల్ మస్క్ అన్నారు. టెస్లా ఓ పబ్లిక్ కంపెనీ కావడంతో, కంపెనీ ప్రయోజనాలపైనా ఎలాన్ మస్క్ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఇదివరకే ఎలాన్ మస్క్ భారత్ విషయంలో చాలా సార్లు తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. భారత్ 2030 నాటికి 30% ప్యాసింజర్ వాహనాల్లో, 80% ద్విచక్ర, త్రిచక్ర వాహనాల్లో, 70% కమర్షియల్ వాహనాల్లో ఈవీ వినియోగాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా భారత్ చేస్తున్న ప్రణాళికలు, టెస్లా చేరికతో మరింత వేగం అందుకునే అవకాశముంది. మోదీతో చర్చల అనంతరం, ఎలాన్ మస్క్ “భారత్ పర్యటన కోసం ఎదురు చూస్తున్నాను” అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates