-->

పంజాబ్ కింగ్స్.. భారీ పెట్టుబడి వృధా కాలేదు

ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ ఒక రివైవల్ చరిత్రను రాసింది. మెగా వేలంలో భారీగా పెట్టుబడి పెట్టిన ఫలితం ఇప్పుడు అందరికీ కనపడుతోంది. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను రూ.26.75 కోట్లకు కొనుగోలు చేయడం పెద్ద సంచలనం అయ్యింది. అలాగే ప్రధాన బౌలర్ ఆర్షదీప్ సింగ్‌ను రూ.18 కోట్లకు రీటైన్ చేయడం కూడా కీలక నిర్ణయం. ఇప్పుడు ఆ ఇద్దరూ తమ విలువను అసాధారణంగా నిరూపించారు.

అయ్యర్ క్వాలిఫయర్-2లో ముంబయిని చిత్తుచేసే విజయానికి నిలయమయ్యాడు. ఓపెనింగ్ నుంచి ఆఖరి వరకు క్రీజులో నిలబడి 87 పరుగులు చేసి, విజయం దిశగా జట్టును నడిపించాడు. అతడి బ్యాటింగ్‌లో కనిపించిన పట్టుదల, శాంతంగా ఉండే తీరు, ఆపదలోనూ ఆత్మవిశ్వాసం కలిగిన కెప్టెన్సీ.. ఇవన్నీ పంజాబ్ కింగ్స్‌కు ధైర్యాన్ని ఇచ్చాయి. ఐపీఎల్ చరిత్రలో మూడు వేర్వేరు జట్లను ఫైనల్‌కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్‌గా కూడా శ్రేయస్ నిలిచాడు.

మరోవైపు ఆర్షదీప్ సింగ్ తన బౌలింగ్‌తో కీలక వికెట్లు తీయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఎప్పుడైతే ప్రెషర్ సీన్ వస్తే.. అప్పుడు ఆర్షదీప్ బౌలింగ్ చేయడం పంజాబ్ స్ట్రాటజీగా మారింది. అతని యార్కర్స్, డెత్ ఓవర్లలోని కంట్రోల్.. మ్యాచులు తిరిగేలా చేస్తున్నాయి. ఇలా ఒక దశలో ఆర్షదీప్ వైపు కోచ్, కెప్టెన్ కూడా ఫుల్ ట్రస్ట్ పెట్టారు. రూ.18 కోట్లకు రీటైన్ చేసిన ఆర్షదీప్ ఆ మొత్తం విలువను ఇప్పుడు న్యాయం చేస్తున్నాడు.

చాహల్ గాయం కారణంగా ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయినప్పటికీ, జట్టులో అతని ఉనికి కీలకం. అతని అనుభవం, మార్గదర్శకత యంగ్ బౌలర్లకు శ్రేయస్ కంటే తక్కువ కాదు. ఒకసారి ఫిట్ అయితే, ఫైనల్ వంటి హై ప్రెజర్ మ్యాచ్‌లో అతని స్పిన్ అనుభవం పంజాబ్‌కు అదనపు బలం. మొత్తంగా చూస్తే, పంజాబ్ యాజమాన్యం పెట్టిన భారీ ఖర్చు ఇప్పుడు ఫలితాలివ్వడమే కాదు, టైటిల్‌కు దగ్గరగా తీసుకువెళ్తోంది. శ్రేయస్, ఆర్షదీప్, చాహల్ లాంటి ప్లేయర్లను స్ట్రాటజిక్‌గా ఎంపిక చేయడం… ప్లే ఆఫ్ స్టేజ్‌లో బలంగా నిలబడేందుకు మూల కారణం. ఇప్పుడు వాళ్ల కష్టానికి, క్లాస్‌కు ఫలితం ఇవ్వాల్సిన సమయం వచ్చింది.