మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ మిస్ అయింది. భారత్ నుంచి ఎన్నో ఆశలతో బరిలో ఉన్న నందిని గుప్తా.. ఆఖరి దశ టెస్టులో ఎలిమినేట్ అయింది. హైదరాబాద్‌లో అత్యంత ఆడంబరంగా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో భారత సుందరి.. చందమామను తలపించే నందనీ గుప్తా.. టాప్ 8లో ఉన్నారు. అయితే.. ఖండాల వారీగా ఇద్దరేసి చొప్పున తుది దశకుఎంపిక చేసిన వారిలో ఒక్కొక్కరి చొప్పున చివరి రౌండ్ కు ఎలిమినేట్ చేశారు. ఈ చివరి రౌండ్ కోసం.. సంధించిన ఏకైక ప్రశ్న. “మీరు మిస్ వరల్డ్ అయితే.. ఏం చేస్తారు?” అనే. అయితే.. దీనికి సదరు కంటెస్టెంట్లు కేవలం 45 సెకన్లలోనే సమాధానం చెప్పాలి.
అది కూడా.. న్యాయమూర్తులను మెప్పించే విధంగా ఉండాలి. ఈ విషయంలోనే చాలా మంది తడబడ్డారు. ఈ క్రమంలో మిస్ వరల్డ్ పోటీల్లో ఉన్న నందిని గుప్తా.. ఎలిమినేట్ అయ్యారు. ఇక, ఎనిమిది మందిలో చాలా మంది ఇదే ప్రశ్నకు తడబడడం గమనార్హం. ఒకరిద్దరు 42, 40 సెకన్లలోనే సమాధానం ఇచ్చినా.. అది న్యాయనిర్ణేతలను సంతృప్తి పరచలేదు. దీంతో వారు కూడా ఎలిమినేట్ అయ్యారు. చివరకు థాయ్‌ల్యాండ్ దేశానికి చెందిన ఓపల్ సుచాతా మిస్ వరల్డ్ గా నిలిచారు. దీంతో ఆమెకు ఈ అవార్డు దక్కింది.
వీటిలోకీలకమైన ‘బ్యూటీ విత్ ఏ పర్సస్’లో మిస్ ఇండోనేషియా, మిస్ వేల్స్, మిస్ ఉగాండ విజయం దక్కించుకున్నారు. ఈ పోటీలోనే మిస్ ఇంగ్లండ్ మాగీ తప్పుకొన్నారు. పలు ఆరోపణలు కూడా చేశారు. బ్యూటీ విత్ ఏ పర్సస్, టాలెంట్ ఈవెంట్ రెండింట్లోనూ మిస్ ఇండోనేషియా మోనిక కేజియా విజయం దక్కించుకున్నారు. ఫ్యాషన్ గ్రాండ్ ఫినాలేలో టాప్ మోడల్‌గా మిస్ ఇండియా నందినీ గుప్తా విజేతయ్యారు. అయితే.. చివరి రౌండ్‌లో ఎలిమినేట్ అయ్యారు.
డబ్బే డబ్బు..
విశ్వసుందరిగా విజయం దక్కించుకున్న థాయిలాండ్ భామ ఓపల్ సుచాతాకు 8.5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ(భారత కరెన్సీలో) అందనుంది. అదేవిధంగా 5 కోట్ల రూపాయల విలువైన భారీ వజ్రాల కిరీటాన్ని కూడా బహూకరిస్తారు. అంతేకాదు.. ఏడాది పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఏదేశంలో అయినా విడిది చేయొచ్చు. పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ప్రపంచ దేశాల అధికారిక కార్యకలాపాలకు.. ఆహ్వానం అందుతుంది. ఇక, ప్రమోషన్లు, సినిమాల్లో అవకాశం, యాడ్స్ తదితరాలు అదనం.