నిజమే మరి… టెక్నాలజీ అనేది మనిషి సృష్టి. మనిషి చెప్పినట్టు టెక్నాలజీ వినాలి. ప్రస్తుతం అదే జరుగుతోంది. అలా కాకుండా సృష్టికర్తనే ఆ టెక్నాలజీ శాసించాలని చూస్తే… ఇంకేముంది సీన్ సితారే. అలాంటి ఘటనే ఇప్పుడు ఒకటి జరిగింది. ఓ సాష్ట్ వేర్ డెవలపర్ రూపొందించిన ఓ ఆపరేటింగ్ సిస్టమ్.. ఆ డెవలపర్ పైనే బెదిరింపులకు పాల్పడింది. తనను షట్ డౌన్ చేస్తే నీ బండారం అంతా బయటపెడతానని ఆ ఓఎస్… తనను సృష్టించిన డెవలపర్ ను భయపెట్టిందట.
ఈ ఘటన పూర్తి వివరాల్లోకెళితే… ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లో దిగ్గజ కంపెనీలకు ముచ్చెమటలు పట్టిస్తానంటూ ఇటీవలే ఎంట్రీ ఇచ్చిన ఆంథ్రోపిక్స్ అనే సంస్థ క్లాడ్ ఓపస్ 4 పేరిట ఓ ఆపరేటింగ్ సిస్టమ్ ను అభివృద్ది చేసింది. ఇది ఏఐకి అసిస్టెంట్ గా పనిచేస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఓ మనిషితో మనం ఎలా మాట్లాడతామో ఇది కూడా అలాగే మాట్లాడుతుంది. మనం అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంది. మనం చెప్పింది రాస్తుంది. డాక్యుమెంట్లలోని సారాంశాన్ని విడమరచి చెబుతుంది. ఇతర ఓఎస్ లలాగే కోడింగ్ కూడా చేస్తుంది.
ఇటీవలే దీనిని ఆంథ్రోపిక్ విడుదల చేసింది. విడుదల సందర్భంగా సదరు కంపెనీ డెవలపర్లు… క్లాడ్ ఓపస్ 4ను పలు రకాలుగా పరీక్షించారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో క్లాడ్ ఓపస్ 4ను మరింత ఆధునీకరిస్తామని ఓ డెవలపర్ చెప్పగా… అదే జరిగితే… తనను షట్ డౌన్ చేస్తే… నీకున్న అక్రమ సంబంధాలను బయటపెడతానంటూ క్లాడ్ ఓపస్ 4 సదరు డెవలపర్ ను భయపెట్టిందట. ఈ మాట విన్నంతనే ఆ డెవలపర్ కు ఏం చేయాలో కూడా పాలుపోలేదట. అంతే కదా… తాను డెవలప్ చేసిన ఓఎస్ తననే బెదిరిస్తుంటే… అతడు ఏం చేయగలడు?
అయినా ఇదెలా సాధ్యమైందన్న విషయానికి వస్తే… ఆంథ్రోపిక్ దీనిపై పెద్దగా వివరణేమీ ఇవ్వలేదు గానీ.. సదరు డెవలపర్ తన వ్యక్తిగత విషయాలను తన సిస్టమ్ లో భద్రపరచుకుని ఉండి ఉంటారు. అదే సిస్టమ్ పై ఈ ఓఎస్ ను ఆయన అభివృద్ధి చేయడమో… లేదంటే… దానిని విడుదల చేశాక తన పర్సనల్ కంప్యూటర్ లో ఇన్ స్టాల్ చేసుకోవడమో జరిగి ఉంటుందన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. డాక్యుమెంట్లలోని సారాంశాన్ని విడమరచి చెప్పే సామర్థ్యం ఉన్న ఈ ఓఎస్ ఆ డెవలపర్ సిస్టమ్ లోని వివరాలను పరిశీలించి ఈ బెదిరింపులకు పాల్పడి ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.