రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వెంటవెంటనే టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ఇవ్వడం క్రికెట్ అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. దాదాపు 15 ఏళ్లుగా భారత జట్టులో కీలక పాత్ర పోషిస్తున్న ఇద్దరూ ఒక్కసారిగా టెస్ట్‌లకు వీడ్కోలు చెప్పడంతో బీసీసీఐ వర్గాలు కూడా ఆశ్చర్యపోయినట్లు సమాచారం. వీరిని హోల్డ్ చేయడానికి బోర్డు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని వార్తలు వచ్చాయి. మరికొందరైతే రోహిత్, విరాట్ బీసీసీఐ తీరుతో అసంతృప్తిగా ఉన్నారని కూడా ప్రచారం చేశారు.
గంభీర్ ప్రధాన కోచ్ అయ్యాక వారిపై ఒత్తిడి పెరిగిందన్న ఆరోపణలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ ఎట్టకేలకు స్పందించారు. “ఒక ఆటగాడు ఎప్పుడు రిటైర్ కావాలనుకుంటాడో, ఆ నిర్ణయం పూర్తిగా అతనిది. ఎవరు రిటైర్ అవ్వాలని చెప్పరు.. నాకు, సెలక్టర్లుకు లేదా బీసీసీఐకి అలా చెప్పే అర్హత లేదు. అది వ్యక్తిగత నిర్ణయం. ఆ హక్కును గౌరవించాలి,” అని గంభీర్ స్పష్టం చేశారు. తన దృష్టిలో రిటైర్మెంట్ నిర్ణయానికి గౌరవమే తప్ప విమర్శల అవసరం లేదన్నారు.
విరాట్, రోహిత్ లాంటి సీనియర్ ఆటగాళ్లు దూరమవడం జట్టుకు ఎదురుదెబ్బే అయినా, యువ ఆటగాళ్లకు ఇది ఒక గొప్ప అవకాశం అని గంభీర్ అభిప్రాయపడ్డారు. “ఇలాంటి సందర్భాల్లోనే కొత్త ఆటగాళ్లు జట్టు బాధ్యతను తీసుకుంటారు. తక్కువ అనుభవంతోనూ గొప్ప విజయాలు సాధించే బలాన్ని మనం ముందు చూపించాలి,” అని తెలిపారు. గతంలో బుమ్రా లేకుండానే భారత జట్టు ట్రోఫీ గెలుచుకున్న విషయాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు.
ఇదిలా ఉండగా, శనివారం బీసీసీఐ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కోసం జట్టును ప్రకటించనుంది. ఈ సందర్భంగా నూతన టెస్ట్ కెప్టెన్‌ను కూడా ప్రకటించనున్నారు. మీడియా సమావేశంలో గంభీర్‌తో పాటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా పాల్గొంటారని సమాచారం. ఈ ప్రెస్ మీట్‌లో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.