2 కోట్లతో ఆర్సీబీలో కొత్త ఆటగాడు

భారత్-పాకిస్థాన్ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకోవడం వల్ల, ప్లేఆఫ్స్‌కు సమీపంలోనే కొందరు ఆటగాళ్లు తమ జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభావం RCBతో పాటు మరికొన్ని జట్లపై కూడా పడింది. ఈ సీజన్ కోసం కొత్త రూల్ తీసుకు వచ్చారు. ఆటగాళ్లు అందుబాటులో లేకపోతే కొత్తగా ఎవరినైనా తెచ్చుకోవచ్చని ప్రకటన చేసింది.

ఇక ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ దశకు చేరుతున్న కీలక సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో ఒక కీలక మార్పు చోటుచేసుకుంది. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ తన జాతీయ జట్టు బాధ్యతల కారణంగా లీగ్ దశ తర్వాత జట్టుకు దూరం కానున్నాడు. ఈ నేపధ్యంలో ఆర్సీబీ మేనేజ్‌మెంట్ అతని స్థానంలో న్యూజిలాండ్‌కు చెందిన వికెట్ కీపర్-బ్యాటర్ టిమ్ సీఫెర్ట్‌ను ఎంపిక చేసింది.

సీఫెర్ట్ కోసం ఫ్రాంచైజీ రూ.2 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో మంచి ఫార్మ్‌లో ఉన్న సీఫెర్ట్, ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో గట్టిగానే ఆడాడు. ఇప్పుడు RCB తరఫున మే 27న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరగనున్న లీగ్ మ్యాచ్‌లో తొలి అవకాశం దక్కే అవకాశముంది. బెంగళూరు జట్టుకు ఇది కొత్త ఊపునిస్తుందనే ఆశాభావం అభిమానుల్లో కనిపిస్తోంది.

ఇటీవల వరుస విజయాలతో ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు బెర్త్ దక్కించుకుంది. ఇలాంటి సమయంలో టిమ్ సీఫెర్ట్ లాంటి ఆటగాడు చేరడం జట్టుకు మరింత బలాన్నిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక జట్టులో ఎవరెవరు తుది జట్టులో చోటు దక్కించుకుంటారన్న ఉత్కంఠ మరోసారి పెరిగింది. మొత్తానికి, ఈ మార్పు RCB గేమ్‌ప్లాన్‌కు కొత్త శక్తి తీసుకురావడమైపోయింది.