ఐపీఎల్ 2025 సీజన్ మునుపెన్నడూ లేని ఉత్కంఠకర దశలోకి వెళ్లింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించడంతో టోర్నీలో తొలి ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారైంది. ఈ ఫలితంతో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ కూడా నాకౌట్ బరిలోకి వెళ్లిపోయాయి. అయితే మిగతా స్థానాల కోసం ముంబయి, ఢిల్లీ, లక్నో మధ్య గట్టి పోటీ నెలకొంది.
18 పాయింట్లతో గుజరాత్ టైటాన్స్ టాప్‌లో ఉంది. ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండటంతో గిల్ సేన 22 పాయింట్లను చేరే అవకాశముంది. అలా అయితే టాప్ ప్లేస్ ఖాయం. అదే సమయంలో ఒక మ్యాచ్ ఓడితే ఆర్సీబీకి టాప్-2కు అవకాశం ఉంటుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 17 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కి చేరింది. మిగిలిన రెండు గెలిస్తే 21 పాయింట్లు సాధించవచ్చు. ఒకవేళ గుజరాత్ ఓడితే, బెంగళూరుకు టాప్-2 అవకాశాలు బలపడతాయి. సుదీర్ఘకాలంగా టైటిల్ కోసం ఎదురుచూస్తున్న ఆర్సీబీకి ఇది కీలక సమయం.
పంజాబ్ కింగ్స్ కూడా ప్లేఆఫ్స్ టికెట్ దక్కించుకుంది. శ్రేయాస్ అయ్యర్ సేనకి మిగిలిన రెండు మ్యాచ్‌లు కీలకం. ఒకవేళ పూర్తి విజయాలు సాధిస్తే, టాప్-2లో నిలిచే ఛాన్స్ దక్కుతుంది. కానీ ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది.
ఇక ముంబయి, ఢిల్లీ, లక్నోలకు ఇంకా గందరగోళమే. ముంబయి 14 పాయింట్లతో నిలవగా, రెండు మ్యాచుల్లో గెలిస్తే 18కి చేరుతుంది. నెట్ రన్‌రేట్ బలంగా ఉండడంతో ఒక మ్యాచ్ గెలిచినా ఆశ ఉంటుందిగానీ, ఇతర జట్ల సమీకరణలే కీలకం. ఢిల్లీ 13 పాయింట్లతో ఉందిగానీ, మిగిలిన రెండు గెలవాల్సిందే. అదనంగా పంజాబ్ చేతిలో ముంబయి ఓడాలన్న షరతు కూడా ఉంది. ఇక లక్నోకు మిగిలిన మూడు మ్యాచుల్ని గెలిచినా, ఇతర ఫలితాలపై ఆధారపడాల్సిందే. ఓటమి వస్తే టోర్నీ నుంచి అవుట్ అవ్వడం ఖాయం.