ప్రాణాలకు తెగించారు గానీ… ఫలితం లేకుండా పోయింది

హైదరాబాద్ లోని పాతబస్తీ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో మొత్తం 17 మంది మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ఆ తర్వాత వెలుగులోకి వచ్చాయి. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే ఓ మసీదు ఉండగా.. ఉదయాన్నే ప్రార్థనల కోసం వచ్చిన ఐదుగురు ముస్తిం యువకులు మంటలను చూసి తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా రంగంలోకి దూకారు గానీ…అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ యువకుల సాహసం వృథాగా మారిపోయింది. ఇక బాధిత కుటుంబాలకు చెందిన మరో వ్యక్తి తన బంధువులను కాపాడి తాను మాత్రం అగ్నికి ఆహుతి అయ్యాడు.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే… గుల్జార్ హౌస్ సమీపంలోని మసీదులో ఉదయమే ప్రార్థనలు ముగించుకున్న గాజుల వ్యాపారి మీర్ జాహెద్, మహ్మద్ అమేర్, మహ్మద్ ఇబ్రహీంలతో పాటు మరో ఇద్దరు అక్కడికి సమీపంలోని ఓ టీ కొట్టు వద్ద టీ తాగుతున్నారు. అదే సమయంలో అక్కడికి సమీపంలోని ఓ భవనంలో నుంచి పొగలు రావడాన్ని గుర్తించారు. ఏమైందో చూద్దామని అటుగా వెళ్లగా…పొగలు వస్తున్న భవనంలో నుంచి ఇద్దరు మహిళలు తమను కాపాడాలంటూ కేకలు వేశారు. ఆ ఆర్తనాదాలు విన్నంతనే ఐదుగురు యువకులు ముందూ వెనుకా చూడలేదు. నేరుగా ఆ భవనంలోకి దూకేశారు. అప్పటికే పొగతో నిండిపోయిన ఆ భవనం గ్రిల్స్ ను పగలగొట్టి లోపలికి ప్రవేశింంచారు.

అయితే ఆ గ్రిల్స్ లోపల ఓ వ్యక్తి అప్పటికే విగత జీవిగా కనిపించాడు. ఇంకాస్త ముందుకెళితే…ఓ మహిళ తన పిల్లలను ఒడిలో పెట్టుకుని ప్రాణాలు విడిచి కనిపించింది. అంతటి భయానక దృశ్యాలను చూసి కూడా ఆ యువకులు వెనక్కు తగ్గలేదు. తమకు కనిపించిన వారినంతా వారు బయటకు తీసుకువచ్చారు. అలా వారు మొత్తం 13 మందిని మంటల్లో నుంచి బయటకు తీసుకువచ్చారు. అయితే వారంతా అప్పటికే చనిపోయారట. నిండా పొగలతో అలముకున్న ఆ భవంంతిలోకి ముఖానికి గుడ్డలు కట్టుకుని వెళ్లిన ఆ యువకులు కనిపించిన వారినంతా కాపాడే ప్రయత్నం చేశారు గానీ… వారి కష్టం బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. అప్పటికే ఆలస్యం అయ్యింది. ఆక్సిజనో, లేదంటో ఇంకేదో లైఫ్ సేవింగ్ ఎక్విప్ మెంటో వారికి అందుబాటులో ఉంటే వారు కొందరి ప్రాణాలు అయినా కాపాడేవారే.

ఇదిలా ఉంటే… ఈ ప్రమాదంలో చనిపోయిన ఇంటి పెద్ద ప్రహ్లాద్ మోదీ సోదరుడి కుమారుడు అబిషేక్ మోదీ నిజంగానే వీర మరణం పొందాడని చెప్పాలి. తమ బంధువులను మంటల నుంచి కాపాడేందుకు అబిషేక్ తన ప్రాణాలనే పణంగా పెట్టాడు. మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన అభిషేక్… తనకు సమీపంలోని బంధువులతో కలిసి మంటల నుంచి బయట పడ్డాడు. అయితే మరింత మంది తమ బంధువులు మంటల్లో చిక్కుకున్నారని బావించి తిరిగి లోపలికి వెళ్లాడు. ఈ క్రమంలో తన సోదరి పిల్లలు ఇద్దరితో పాటు మరో బంధువును బయటకు పంపాడు. ఈ క్రమంలో ఆయన మాత్రం మంటలకు ఆహుతి అయ్యాడు.