పాతబస్తీలో ఘోరం.. అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి

భాగ్యనగరి హైదరాబాద్ పరిధిలోని పాతబస్తీలో సెలవు దినం ఆదివారం ఘోరం జరిగింది. పాతబస్తీలోని చార్మినార్ ప్రాంతానికి చెందిన గుల్జార్ హౌస్ లో ఆదివారం ఉదయం ఉన్నట్టుండి మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో చిక్కుకున్న వారిలో 17 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఎక్కువ ఉన్నట్లు సమాచారం. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు.

బహుళ అంతస్తుల భవనంగా ఉన్న గుల్జార్ హౌస్ లో పలు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఆదివారం ఉన్నట్టుండి హౌస్ లోని తొలి అంతస్తులో ఏసీ కంప్రెజర్ పేలి మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఈ మంటలు ఇతర అంతస్తులకూ విస్తరించాయి. మంటలు చెలరేగిందే తొలి అంతస్తు కావడంతో పై అంతస్తుల్లోని వారు వేగంగా బయటకు రాలేకపోయారు. ఈ కారణంగానే ఈ ప్రమాదంలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పక తప్పదు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ప్రమాదంపై స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అప్పటికే మంటల్లో చిక్కుబడిపోయిన వారిలో ముగ్గురు చనిపోగా… వీలయినంత ఎక్కువ మందిని మంటల నుంచి బయటకు తీసుకుని వచ్చి ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించి చికిత్స మొదలుపెట్టేలోగానే మరో 14 మంది చనిపోయారు. దీంతో ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా 17 మంది చనిపోయినట్టు అయ్యింది.

ఇక ఈ ఘటనలో గాయపడ్డ వారిని సమీపంలోని ఉస్మానియా, యశోద, డీఆర్డీఓ, అపోలో ఆసుపత్రులకు తరలించారు. అగ్ని ప్రమాదంలో ఏకంగా 8 మంది సజీవ దహనం కావడంతో తెలంగాణ ప్రభుత్వం వేగంగా స్పందించింది. జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సహాయక చర్యల్లో ఎలాంటి జాప్యం లేదన్న ఆయన… ఘటనకు గల కారణాలపై దర్యాప్తునకు ఆదేశించామని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ప్రదాని నరేంద్ర మోదీ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.