రాజస్థాన్ రాష్ట్రం కోట్‌పుత్లీ-బెహ్రోర్ జిల్లాలో ఒక తల్లిని ఖననం చేసే వేళ జరిగిన దారుణం నెట్టింట తీవ్ర చర్చకు దారితీస్తోంది. కన్నతల్లి అంత్యక్రియలు నిర్వహించాల్సిన చోట, చితిపై పడి నగల కోసం గొడవపడిన కొడుకు కనిపించడమే ఘటన తీవ్రతకు నిదర్శనం. కుటుంబ వివాదాలు, ఆస్తి విషయంలో తలెత్తిన తగాదాలు చివరకు మాతృమూర్తిని సక్రమంగా అంత్యక్రియ చేయకుండా నిలిపేయించాయి.
ఘటన వివరాల్లోకి వెళ్తే, మే 3న భురీ దేవి అనే వృద్ధురాలు కన్నుమూశారు. ఆమెకు ఏడుగురు కుమారులు ఉన్నా, ఐదో కుమారుడు ఓంప్రకాశ్ వేరుగా నివసించేవాడు. కుటుంబంలో ఆస్తి వివాదాలున్నాయి. భురీదేవి మరణించాక ఆమె ఒంటిపై ఉన్న వెండి కడియాలను పెద్ద కుమారుడైన గిరిధారి వద్ద భద్రపరచారు. చితి వద్దకు చేరుకున్నాక, ఓంప్రకాశ్ తనకు ఆ నగలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, నేరుగా చితిపై పడిపోయాడు.
గ్రామస్తులు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో దాదాపు రెండు గంటల పాటు అంత్యక్రియలు నిలిచిపోయాయి. చివరకు, తల్లి నగలు ఓంప్రకాశ్‌కు అందించడంతో మాత్రమే అతను చితిపై నుంచి లేచి, తల్లి అంత్యక్రియలకు అనుమతి ఇచ్చాడు. ఈ ఉదంతం చుట్టుపక్కల గ్రామాల్లో తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. తల్లిపై ప్రేమ కన్నా నగల మీద మమకారం చూపిన ఓంప్రకాశ్ చర్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ కావడంతో, కుటుంబ సమస్యలు ఎంతలా మానవత్వాన్ని మరిపిస్తాయో చర్చనీయాంశమైంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates