ఐపీఎల్ 2025లో కీలక మార్పుతో బీసీసీఐ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇండియా పాక్ సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్‌ను వారం పాటు నిలిపివేసిన విషయం తెలిసిందే. మే 17 నుంచి మళ్లీ మ్యాచ్‌లు ప్రారంభమయ్యేలా షెడ్యూల్ విడుదలైంది. టోర్నమెంట్ ముగింపు తేదీ మే 25 నుండి జూన్ 3కి మారింది. ఈ మార్పుల వల్ల చాలా మంది విదేశీ ఆటగాళ్లు టోర్నీని విడిచి వెళ్తున్నారు. దీంతో జట్లకు ఆటగాళ్ల రీప్లేస్‌మెంట్ అవసరమైంది.
ఇందుకు అనుగుణంగా బీసీసీఐ ఇప్పుడు కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఇప్పటినుంచి ఏ జట్టు అయినా తాత్కాలిక ఆటగాళ్లను తీసుకోవచ్చని ఆదేశించింది. ఇదివరకటి నిబంధనల ప్రకారం ఒక ఆటగాడు గాయం లేదా అనారోగ్యానికి గురైతేనే రీప్లేస్‌మెంట్ తీసుకోవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు జట్టు వద్దకు రాకపోయిన విదేశీ ఆటగాళ్ల స్థానంలోనూ కొత్త ఆటగాళ్లను తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఇక ఆ ఆటగాళ్లు ఎవరైనా కావచ్చు, లోకల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎవరైనా కావచ్చు.
అయితే బీసీసీఐ ఈ తాత్కాలిక ప్లేయర్లపై ఓ స్పష్టతనూ ఇచ్చింది. ఇప్పుడు తీసుకునే ప్లేయర్లను వచ్చే ఏడాది జట్లు రిటైన్ చేసుకోలేవు. అంటే వాళ్లు 2026 ఐపీఎల్ వేలానికి తప్పకుండా రావాల్సిందే. జట్టు కోణంలో ఇది తాత్కాలికంగా ఉపయోగపడే మార్పే అయినప్పటికీ, రాబోయే సీజన్ వ్యూహాలకు మాత్రం ఎటువంటి అనుసంధానం ఉండదు. ఇక ఇప్పటికే టోర్నీ నిలిపివేతకు ముందు తీసుకున్న రీప్లేస్‌మెంట్లను మాత్రం రిటైన్ చేసుకోవచ్చు.
ఈ కొత్త రూల్‌తో జట్లకు చివరి దశలో తమ బలాన్ని నిలబెట్టుకోవడానికి ఒక అవకాశం లభించింది. డిల్లీ క్యాపిటల్స్‌లో జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, చెన్నైలో జేమీ ఓవర్టన్ వంటి ఆటగాళ్లు టోర్నీని వదిలి వెళ్లిపోయారు. వీరి స్థానాల్లో కొత్త వారిని తీసుకోవచ్చు. కానీ 2026 కోసం మళ్లీ వేలంలో పోటీ పడాలి. దీని వల్ల కొత్త అవకాశాలు లభిస్తే.. ఇక వచ్చే ఏడాది వాటిని కోల్పోతారు. ఫ్రాంచైజీలకు ఇది స్వల్ప ఊరటే అయినా, అభిమానులకు మాత్రం కొత్త ఫేస్‌లను చూసే అవకాశం. మధ్యలో వచ్చిన బ్రేక్‌కి ఇలా ఓ చక్కటి పరిష్కారం తీసుకొచ్చిన బీసీసీఐని ట్రేడ్ వర్గాలు అభినందిస్తున్నాయి. ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచులు మరింత ఆసక్తికరంగా మారనున్నాయన్నది మాత్రం ఖాయం.