భారత్, పాకిస్థాన్ మధ్య పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఒకవేళ ఈ పరిస్థితి యుద్ధంగా మారితే, ఐక్యరాజ్య సమితి (ఐరాస-యునైటెడ్ నేషన్స్) తీసుకునే చర్యలు ఏమిటి అనేది హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉంటుంది. మొదట ఐరాస శాంతితో ప్రాణాలను కాపాడే సంస్థగా ఈ సంక్షోభంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని ప్రధాన లక్ష్యం సైనిక ఘర్షణను నివారించడం, శాంతిని పునరుద్ధరించడం.
మొదట, ఐరాస సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహిస్తుంది. ఈ కౌన్సిల్‌లో ఐదు శాశ్వత సభ్య దేశాలు (అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్) కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. యుద్ధాన్ని ఆపడానికి ఆయా దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించవచ్చు లేదా ఆయుధాల సరఫరాను నిషేధించవచ్చు. వ్యాపార రంగంలో ఐరాసా విధించే ఆంక్షలు చాలా బలంగా ఉంటాయి. దీని కారణంగా భారత్ కంటే ఎక్కువ ప్రభావం పాకిస్థాన్ పై పడే అవకాశం ఉంది. ఇక యుద్ధం జరిగితే తప్పని పరిస్థితుల్లో అవసరమైతే, ఐరాస స్పెషల్ సైనిక దళాలను ఉద్రిక్త ప్రాంతాల్లో మోహరించి, పౌరుల భద్రతను కాపాడుతుంది. గతంలో సిరియా, సుడాన్ వంటి సంఘర్షణల్లో ఇలాంటి చర్యలు చూశాం.
ఐరాస సెక్రటరీ జనరల్ దౌత్యపరమైన చర్చలను ప్రోత్సహిస్తారు. భారత్, పాకిస్థాన్ నాయకులతో మధ్యవర్తిగా వ్యవహరించి, శాంతి చర్చలకు బాటలు వేయవచ్చు. ఉదాహరణకు, 1999 కార్గిల్ యుద్ధ సమయంలో ఐరాస ఇలాంటి దౌత్య ప్రయత్నాలు చేసింది. అయితే, సెక్యూరిటీ కౌన్సిల్‌లో వీటో అధికారం ఉన్న దేశాల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తితే, నిర్ణయాలు ఆలస్యం కావచ్చు. ఉదాహరణకు, చైనా లేదా రష్యా ఒక వైపు నిలబడితే, ఆంక్షలు విధించడం కష్టమవుతుంది. ఇక యుద్ధం జరిగితే రష్యా భారత్ వైపు వుంటుందనేది చైనాకు కూడా తెలుసు.
ప్రస్తుతం ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఇరు దేశాలను సంయమనం పాటించాలని కోరారు. యుద్ధం జరిగితే, ప్రాంతీయ శాంతి దెబ్బతినడమే కాక, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలవుతుంది. ఐరాస శాంతి చర్చలకు పిలుపునిస్తూ, అంతర్జాతీయ సమాజాన్ని ఒక్కతాటిపైకి తెస్తుంది. కానీ, దాని విజయం రాజకీయ సహకారంపై ఆధారపడి ఉంటుంది. ఈ సంక్షోభంలో ఐరాస నిర్ణయాలు శాంతి వైపు నడిపిస్తాయా లేక రాజకీయ ఆటంకాల్లో చిక్కుకుంటాయా అనేది ఆసక్తికరంగా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates