సన్‌రైజర్స్ నెక్స్ట్ ట్రిప్ ఎక్కడ?

ఈసారి ఐపీఎల్ మొదలవుతుండగా.. అందరి కళ్లూ సన్‌రైజర్స్ హైదరాబాద్ మీదే నిలిచాయి. ఆ జట్టును టైటిల్‌కు హాట్ ఫేవరెట్‌గా పేర్కొన్నారు విశ్లేషకులు. అందుక్కారణం.. ఆ జట్టు గత సీజన్లో సృష్టించిన విధ్వంసాలే. పన్నెండేళ్లుగా నిలిచి ఉన్న ఐపీఎల్ అత్యధిక స్కోరు రికార్డును ఒకే సీజన్లో మూడుసార్లు బద్దలు కొట్టిన ఘనత సన్‌రైజర్స్ సొంతం. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి లాంటి విధ్వంసక బ్యాటర్లు ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పట్టించారు. దీంతో సన్‌రైజర్స్‌పై ఈ సీజన్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లే తొలి మ్యాచ్‌లోనే ఆ జట్టు 286 పరుగులు చేసి ఔరా అనిపించింది. దీంతో ఈ ఏడాది సన్‌రైజర్స్ చేతిలో ప్రత్యర్థి జట్లకు బడిత పూజే అంటూ ఎలివేషన్లు ఇచ్చుకున్నారు ఫ్యాన్స్.

కానీ తర్వాత చూస్తే అంతా తిరగబడింది. ఘనవిజయంతో సీజన్‌ను ఆరంభించిన హైదరాబాద్.. తర్వాతి 9 మ్యాచ్‌ల్లో 2 మాత్రమే నెగ్గి 7 మ్యాచ్‌లు ఓడిపోయి దాదాపుగా ప్లేఆఫ్స్ రేసుకు దూరమైన స్థితికి చేరుకుంది. ఈ సీజన్లో సన్‌రైజర్స్ పోరాటం ఇక నామమాత్రమే. సీజన్ ఆరంభంలో హైదరాబాద్‌కు ఎక్కడ లేని ఎలివేషన్లు వేసిన అభిమానులే.. ఇప్పుడు తెగ తిట్టిపోస్తున్నారు. ఇక మిగతా జట్ల ఫ్యాన్స్ అయితే సన్‌రైజర్స్‌ను మామూలుగా ఎగతాళి చేయట్లేదు. కాటేరమ్మ కొడుకులు అంటూ ఇంతకుముందు ఇచ్చిన ఎలివేషన్లపై వెటకారాలు ఆడుతున్నారు.

గత మ్యాచ్‌లో చెన్నైపై నెగ్గి ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకున్న హైదరాబాద్ జట్టు.. వెంటనే మాల్దీవుల్లో విహారానికి వెళ్లడం మీద ఇప్పుడందరూ కౌంటర్లు వేస్తున్నారు. తర్వాతి మ్యాచ్‌కు ముందు విరామం దొరికితే నెట్స్‌లో మరింత శ్రమించి విన్నింగ్ స్ట్రీక్‌ను కంటిన్యూ చేయడం మీద దృష్టిపెట్టకుండా వెకేషన్‌కు వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ ఏ పర్యటనకు వెళ్తున్నారంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఈసారి ‘అస్సాం’ వెళ్లండి అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ సీజన్‌ ఎలాగూ నాశనమైంది.. వచ్చే సీజన్‌కు అయినా ఎలా మెరుగుపడాలో దృష్టిపెట్టాలని.. 300 టార్గెట్ పక్కన పెట్టి మ్యాచ్‌లు గెలిచే మార్గం చూడాలని అంటున్నారు.