ఇప్పుడు క్రికెట్ ప్రియుల ఫేవరెట్ ఫార్మాట్ అంటే టీ20లే. టెస్టులు, వన్డేలను చూసి ఆస్వాదించే ఓపిక వాళ్లకుండట్లేదు. మూడు గంటల్లో అపరిమిత వినోదాన్ని అందించే టీ20లంటేనే ఎక్కువమందికి ఇష్టం. ఆ ఫార్మాట్లో అభిమానుల్ని అమితంగా అలరించిన ఆటగాడు క్రిస్ గేల్. మరే క్రికెటర్‌కూ సాధ్యం కాని విధంగా టీ20ల్లో ఏకంగా వెయ్యి సిక్సర్లు బాదిన ఘనుడతను. ఐపీఎల్‌లో అతడి మెరుపుల గురించి ఎంత చెప్పినా తక్కువే.
20 ఓవర్ల ఆటలో ఒక్కడే 175 పరుగులు చేసినా.. ఒకే ఓవర్లో 39 పరుగులు రాబట్టినా అది గేల్‌కే చెల్లింది. ఇంకా మరెన్నో ఘనతలు అతడి సొంతం. ఐపీఎల్‌లో అతడి పనైపోయిందనుకున్న తరుణంలో ఈ సీజన్లో లేటుగా ఎంట్రీ ఇచ్చి మెరుపులు మెరిపించాడతను. తన చివరి మ్యాచ్‌కు ముందు కూడా 99 పరుగులు కొట్టి ఔరా అనిపించాడు. చివరి మ్యాచ్‌లో అతను విఫలం కాగా.. కింగ్స్ ఎలెవన్ కూడా ఓటమి పాలై ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది.
ఐతే ఈ సీజన్లో గేల్ బాగా ఆడిన నేపథ్యంలో ఇంకో ఐదు నెలల్లో జరిగే టీ20 లోనూ అతను ఆడతాడనే ఆశతో ఉన్నారు అభిమానులు. కానీ గేల్ ఆలోచన మాత్రం మరోలా ఉన్నట్లుంది. అతను ఐపీఎల్ నుంచి నిష్క్రమించబోతున్నట్లు సంకేతాలిచ్చాడు. నా సీజన్ పూర్తయినా మీరంతా టీ20 లీగ్‌ను చూస్తూ ఆస్వాదించండి అని అతను ట్వీట్ చేశాడు. దీంతో గేల్ ఐపీఎల్ ప్రస్థానం ముగిసిందని, అతను రిటైరైపోతున్నాడని అభిమానులు గగ్గోలు పెడుతున్నారు.
వయసు 40 దాటినా.. ఈ సీజన్లో బాగా ఆడిన గేల్.. వచ్చే సీజన్లోనూ ఆడాలనే అందరూ కోరుకుంటూ గేల్ రిటైర్ కావద్దంటూ మెసేజ్‌లు పోస్ట్ చేశారు. కానీ గేల్ మాత్రం సైలెంటుగా ఉండిపోయాడు. ఐతే లీగ్‌లో తన జట్టు నిష్క్రమించిన నేపథ్యంలో గేల్ ఇలా ట్వీట్ చేసి ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆల్రెడీ చెన్నై ఆటగాడు షేన్ వాట్సన్ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో గేల్ కూడా అతడి బాటలో నడిచేట్లయితే మాత్రం అభిమానులకు నిరాశే.
Gulte Telugu Telugu Political and Movie News Updates