దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణ హత్య అందరిని ఉలిక్కిపడేలా చేసింది. 68 ఏళ్ల వయసులో ఉన్న భర్తను చంపటం ఒక ఎత్తు అయితే.. అందుకు అనుసరించిన కిరాతక తీరు అందరిలోనూ కొత్త ప్రశ్నలు తలెత్తేలా చేసింది. ఈ హత్యకేసులో కీలక నిందితురాలైన భార్య పల్లవి తీరుపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా పలు అంశాల్ని గుర్తించారు. భర్తను చంపటానికి ఐదు రోజుల ముందు నుంచి గూగుల్ లో ఎలా హత్య చేయాలన్న అంశంపై భార్య పల్లవి శోధించిన విషయాన్ని గుర్తించారు.
అంతేకాదు.. ఎక్కడి నరాలు తెగితే మనిషి త్వరగా మరణిస్తాడన్న వివరాల్నిసేకరించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. మాజీ డీజీపీ ఓంప్రకాశ్ హత్యలో ఆయన భార్య పల్లవి.. కుమార్తె క్రతి కూడా ఉన్నట్లు గుర్తించారు. అయితే.. భర్తను తానే చంపేసినట్లుగా భార్య పల్లవి ఒప్పుకోవటంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. హత్య కేసులో కుమార్తె క్రతి పాత్ర ఎంతన్న విషయంపై పోలీసులు అవగాహనకు వచ్చినా.. మరింత సమాచారం కోసం లోతుగా విచారిస్తున్నారు. ఆమె ప్రస్తుత మానసిక స్థితిని కూడా వైద్యులు పరిశీలిస్తున్నారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న పల్లవికి 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీకి అప్పగించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సోమవారం సాయంత్రం ఆమెను ఘటనాస్థలానికి తీసుకెళ్లి ప్రశ్నించారు. హత్యకు ముంు నిందితురాలు వాట్సప్ గ్రూపుల్లోపలు సందేశాలు పోస్టు చేసినట్లుగా గుర్తించారు. విచారణ వేళ.. తన సొంత ఇంట్లో తనను బంధించారని.. నిరంతరం నిఘాలో ఉన్నట్లుగా ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. కూతురు భద్రత మీదా ఆమె ఆందోళన వ్యక్తం చేయటం గమనార్హం.
పోలీసుల విచారణలో మరో కొత్త కోణం వెలుగు చూసింది. ఓంప్రకాశ్ హత్యకు భార్య మానసిక స్థితి ఎంత కారణమో.. ఆస్తి గొడవలు అంతే కారణంగా గుర్తించారు. ఓం ప్రకాష్ భార్య.. కూతురు దగ్గర కంటే కూడా కొడుకు.. తన సోదరి ఇంట్లోనే ఎక్కువగా ఉంటారని గుర్తించారు. అంతేకాదు.. తనకున్న 17 ఎకరాల భూమిని కొడుక్కి.. సోదరికి కట్టబెట్టేందుకు సిద్ధం కావటం.. దీనిపై భార్య.. కుమార్తెలు తీవ్రంగా గొడవపడేవారు. చివరకు ఓంప్రకాష్ ప్రాణాల్ని తీసేలా పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.