విమానంలో హైజాకర్ దాడి.. హత్య చేసిన ప్రయాణికుడు

బెలిజ్ దేశంలో ఓ చిన్నపాటి విమానంలో హైజాక్ యత్నం తీవ్ర కలకలం రేపింది. ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో ఒక్కసారిగా కత్తితో దాడికి దిగిన వ్యక్తిని, మరో ప్రయాణికుడు తుపాకీతో కాల్చి చంపిన ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన గురువారం మెక్సికో సరిహద్దుకు సమీపంలోని కొరోజల్ పట్టణం నుండి శాన్ పెడ్రో నగరానికి బయలుదేరిన ట్రోపిక్ ఎయిర్ విమానంలో జరిగింది.

ఈ విమానంలో మొత్తం 14 మంది ప్రయాణికులు ఉన్నారు. అమెరికాకు చెందిన అకిన్యేల సావా టేలర్ అనే వ్యక్తి తన వద్ద ఉన్న కత్తితో పైలట్‌పై దాడి చేస్తూ, విమానాన్ని దేశం వెలుపలికి మళ్లించాలని డిమాండ్ చేశాడు. అంతేకాకుండా, ఇంధనం నింపేందుకు ల్యాండ్ చేయాలంటూ హడావుడి చేశాడు. ఈ గందరగోళంలో పైలట్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు కత్తి దాడిలో గాయపడ్డారు. విమానంలో బీభత్స వాతావరణం నెలకొంది.

అయితే, అదే సమయంలో గాయపడిన ప్రయాణికుల్లో ఒకరికి లైసెన్స్ ఉన్న తుపాకీ ఉండటంతో, అతను తీవ్రంగా స్పందించాడు. విమానం ల్యాండ్ కావడానికి కాస్త ముందే, హైజాకర్ టేలర్‌పై కాల్పులు జరిపాడు. బుల్లెట్ టేలర్ ఛాతీకి తగలడంతో అతను కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

గాయపడిన ముగ్గురు బెలిజ్ పౌరులకు ప్రస్తుతానికి వైద్య సాయం అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విమానం ఇంధనం కూడా అయిపోతున్న పరిస్థితిలో ఉన్నా, పైలట్ చాకచక్యంగా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడం ప్రాణాపాయం నుంచి అందరిని కాపాడింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.