మోదీ సేనలోకి మరో సీనియర్ క్రికెటర్

క్రికెట్ కెరీర్ లు గుడ్ బై చెప్పిన అనంతరం కొందరు ఆటగాళ్లు డైరెక్ట్ గా పాలిటిక్స్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఈమధ్య కాలంలో గంభీర్, మనోజ్ తివారి లాంటి ప్లేయర్స్ బాగా సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఇక టీమిండియా మాజీ ఆటగాడు కెదార్ జాదవ్ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాడు. 2024లో క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన ఈ ఆల్‌రౌండర్ తాజాగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరాడు. 

ముంబయిలో జరిగిన ఒక పార్టీ కార్యక్రమంలో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్‌కులే సమక్షంలో జాదవ్ చేరిక జరగింది. మున్ముందు బీజేపీలో సేవలందించాలని ఆయన నిర్ణయించుకున్నారు. కెదార్ జాదవ్ మాట్లాడుతూ, “ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు వందనం. ప్రధాని మోదీ గారి నాయకత్వంలో, మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌తో కలిసి బీజేపీ అభివృద్ధి కోసం పనిచేస్తోంది. చంద్రశేఖర్ బావన్‌కులే గారి ఆహ్వానంతో నేను బీజేపీలో చేరుతున్నాను” అని చెప్పారు. రాజకీయాల్లో నూతన అధ్యాయం ప్రారంభించిన జాదవ్‌పై బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మాజీ క్రికెటర్‌ను పార్టీలోకి స్వాగతించిన బావన్‌కులే, “ఇది మాకు ఆనందదాయకమైన రోజు. క్రికెట్‌ రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ ప్రభావం చూపిన వ్యక్తి జాదవ్. ఆయన పార్టీలో చేరడం గర్వకారణం. ఆయనతో పాటు హింగోలీ, నాందేడ్‌ నుంచి ఇతరులు కూడా బీజేపీలో చేరారు” అన్నారు. జాదవ్‌ 2014లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌ ద్వారా టీమిండియాలోకి ప్రవేశించి, 2020లో న్యూజిలాండ్‌ పర్యటనలో చివరిసారిగా ఆడాడు. 

తన ఆరేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 73 వన్డేల్లో 1389 పరుగులు, 9 టీ20ల్లో 122 పరుగులు చేశాడు. ఆఫ్హ్ బీట్ బౌలింగ్‌ శైలితో 42 వన్డేల్లో 27 వికెట్లు కూడా తీశాడు. 2018 ఆసియా కప్ గెలిచిన టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోచ్చి టస్కర్స్, ఆర్‌సీబీ, సీఎస్‌కే తరఫున జాదవ్ ఆడాడు. సీఎస్‌కేతో 2018లో ఐపీఎల్ ట్రోఫీ గెలిచాడు. జూన్ 2024లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన జాదవ్, రాజకీయాల్లో కొత్త అడుగు వేసాడు. మరి ఈ కొత్త వేదికపై అతడి ప్రయాణం ఎలా సాగుతుందో చూడాలి.