తిలక్ రిటైర్డ్ ఔట్ పై క్లారిటీ ఇచ్చేసిన హార్దిక్

ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ మరో ఓటమిని మూటగట్టుకుంది. వాంఖడే వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. హార్దిక్ పాండ్య (42), తిలక్ వర్మ (56) పోరాడినప్పటికీ.. గెలవలేకపోయారు. కాగా, గత మ్యాచ్‌లో తిలక్‌ వర్మ ‘రిటైర్డ్‌ ఔట్‌’ కావడం పెద్ద చర్చకు దారి తీసింది. చాలా మంది అభిమానులు, విశ్లేషకులు విమర్శలు గుప్పించగా… ఇప్పుడు హార్దిక్‌ పాండ్య ఆ వ్యూహానికి అసలు కారణాన్ని వెల్లడించాడు.

“బయట ఉన్నోళ్లకు నిజంగా ఏం జరిగిందో తెలీదు” అంటూ హార్దిక్ స్పష్టం చేశాడు. తిలక్‌కు లఖ్‌నవుతో మ్యాచ్‌కు ముందు రోజు బంతి వేలికి బలంగా తాకిందని చెప్పాడు. దాంతో అతడు పూర్తిగా దూకుడుగా ఆడలేకపోయాడని తెలిపాడు. కోచ్ మహేల జయవర్ధన నిర్ణయంతో తిలక్‌ను ‘రిటైర్డ్ ఔట్’గా తీసివేసి కొత్త బ్యాటర్‌తో బౌలర్లపై దాడికి వెళ్లాలని భావించామని చెప్పాడు. ఆ సమయంలో రోహిత్ అందుబాటులో లేని నేపథ్యంలో నమన్ ధిర్‌ను ముందుకు పంపించాల్సి వచ్చిందని వివరించాడు.

వాంఖడే మైదానంలో 220+ లక్ష్యం సాధ్యం అని పాండ్య అభిప్రాయపడ్డాడు. అయితే, పవర్‌ప్లేలో వికెట్లు కోల్పోవడం వాళ్లను వెనక్కి నెట్టిందని అంగీకరించాడు. కొన్ని ఓవర్లలో రన్స్ రాకపోవడంతో మ్యాచ్ చేజారిందని చెప్పారు. చివరి ఓవర్లలో తాము దూకుడు చూపించలేకపోయామని, అది ఓటమికి ప్రధాన కారణమని అన్నారు. అయితే బుమ్రా మళ్లీ మైదానంలోకి రావడం సానుకూల పరిణామమని హార్దిక్ హర్షం వ్యక్తం చేశాడు.

ఈ మ్యాచ్‌లో బెంగళూరు 221/5 స్కోరు చేసింది. ముంబయి 209/9తో ఓటమిపాలైంది. తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నప్పటికీ, మ్యాచ్‌ను గెలిపించలేకపోయాడు. అతనిపై వచ్చిన గత విమర్శలతో పోలిస్తే ఈసారి హార్దిక్ స్పష్టత ఇచ్చాడు. “కెప్టెన్సీలో వ్యూహాలున్నాయి, కానీ ఆటగాళ్ల ఆరోగ్యం కూడా పరిగణనలోకి తీసుకోవాలి” అని చెప్పడం ద్వారా హార్దిక్ మంచి క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు ముంబయి ప్లే ఆఫ్స్ ఆశలు నిలబెట్టుకోవాలంటే.. వచ్చే మ్యాచ్‌లు తప్పనిసరిగా గెలవాల్సిందే.