క్రిస్ గేల్‌.. ప్ర‌పంచంలో ఒకే ఒక్క‌డు


త‌న‌ను తాను యూనివ‌ర్శ‌ల్ బాస్‌గా అభివ‌ర్ణించుకుంటూ ఉంటాడు క్రిస్ గేల్. ప్ర‌పంచ క్రికెట్లో అత‌డి లాంటి ఎంట‌ర్టైన‌ర్లు అరుదు. అత‌ను త‌న జ‌ట్టును గెలిపిస్తాడా లేదా అన్న‌ది ప‌క్క‌న పెడితే గేల్ ఆడితే ఉండే ఎంట‌ర్టైన్మెంటే వేరు. అత‌నున్నాడంటే అభిమానుల‌కు పండ‌గే. ముఖ్యంగా గేల్ బ్యాటింగ్‌లో క్లిక్క‌య్యాడంటే స్టేడియంలో బాణ‌సంచా మోత అన్న‌ట్లే. ప‌దే ప‌దే బంతిని స్టాండ్స్‌లోకి పంప‌డం అత‌డికి వెన్న‌తో పెట్టిన విద్య‌. ఈ నైపుణ్యం, సామ‌ర్థ్యంతోనే ప్ర‌పంచ క్రికెట్లో ఎవ‌రికీ సాధ్యం కాని ఘ‌న‌త‌ను అందుకున్నాడీ విండీస్ వీరుడు. టీ20 క్రికెట్లో వెయ్యి సిక్స‌ర్లు బాదిన ఏకైక ఆట‌గాడిగా గేల్ రికార్డు సృష్టించ‌డం విశేషం.

ఈసారి ఐపీఎల్‌లోకి లేటుగా ఎంట్రీ ఇచ్చి విధ్వంస‌క ఇన్నింగ్స్‌లతో చెల‌రేగిపోతున్నీ ఈ పంజాబ్ ఆట‌గాడు.. శుక్ర‌వారం రాత్రి రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో మ్యాచ్‌లో 99 ప‌రుగులు చేసి త్రుటిలో సెంచ‌రీ చేజార్చుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఏకంగా 8 సిక్స‌ర్లు బాదిన గేల్.. మొత్తంగా టీ20ల్లో త‌న సిక్స‌ర్ల సంఖ్య‌ను 1000కి చేర్చాడు. ప్ర‌పంచంలో మ‌రే బ్యాట్స్‌మ‌న్ కూడా గేల్‌కు ద‌రిదాపుల్లో లేడు.

గేల్ త‌ర్వాత రెండో స్థానంలో ఉన్నది వెస్టిండీస్‌కే చెందిన కీర‌న్ పొలార్డ్. అత‌ను ఇప్ప‌టిదాకా టీ20ల్లో 680 సిక్స‌ర్లు బాదాడు. ఈ సీజ‌న్లో గేల్ ఆడింది ఆరు మ్యాచ్‌లే. అందులోనే 23 సిక్స‌ర్లు బాదేయ‌డం విశేషం. టోర్నీ టాప్ సిక్స‌ర్ల వీరుల్లో అత‌డిది రెండో స్థానం. వెస్టిండీస్‌కే చెందిన పూర‌న్ 25 సిక్స‌ర్ల‌తో అగ్ర స్థానంలో ఉన్నాడు. ద‌శాబ్ద కాలంలో అంత‌ర్జాతీయ క్రికెట్‌తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక టీ20 లీగుల్లో ఆడే గేల్‌కు సిక్సర్లు బాద‌డం మంచినీళ్ల ప్రాయ‌మే.