ఓవర్ చేసిన బౌలర్‌కి బీసీసీఐ షాక్..!

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో ఆటకు మించిన డ్రామాలు ఎక్కువైపోతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ యువ బౌలర్ దిగ్వేశ్ సింగ్ రాఠీ పేరు ఇందుకు ఉదాహరణగా నిలిచింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై లక్నో ఓటమిపాలవగా, మ్యాచ్‌లో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య వికెట్‌ తీసిన తరువాత దిగ్వేశ్ సింగ్ చేసిన హావభావాలు వివాదాస్పదంగా మారాయి. 

అతని నేరుగా ప్రియాన్ష్ దగ్గరకు వెళ్లి లెటర్ రాస్తున్నట్టు హావభావాలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది బీసీసీఐ దృష్టికి చేరింది. ఈ వ్యవహారంపై బీసీసీఐ సీరియస్‌గా స్పందించింది. తమ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను దిగ్వేశ్ సింగ్‌కు మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది. అంతే కాకుండా అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ కూడా చేర్చింది. ఇది మొదటిసారి అయినప్పటికీ, మళ్లీ ఇలాంటి తప్పిదం చేస్తే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

ఆటలో భావోద్వేగాలు సహజమే అయినా, అవి మర్యాదా రీతిలో ఉండాలని బీసీసీఐ స్పష్టం చేసింది. ఐపీఎల్‌లో స్నేహితులే ప్రత్యర్థులై ఆడాల్సి వస్తే ఎమోషన్స్ ఎక్కువవుతాయనే వాదన ఉంది. కానీ, గతంలో ఢిల్లీ టీ20 లీగ్‌లో ఒకే జట్టుకు ఆడిన ప్రియాన్ష్, దిగ్వేశ్ మధ్య ఇప్పుడు ఇలా ఘర్షణగా మారడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆట ముగిసిన తర్వాత మాత్రం ఇద్దరూ హ్యాండ్‌షేక్ చేసుకుని మాట్లాడినట్లు కెమెరాల్లో కనిపించింది. కానీ మ్యాచ్ సమయంలో చేసిన ఆ వ్యాఖ్యాత్మక హావభావాలను మాత్రం ఐపీఎల్ పాలక మండలి ఉపేక్షించలేదు.

ఈ ఘటన అనంతరం లక్నో ఫ్రాంఛైజీ నుంచి ఇంకా స్పందన రాలేదు. అయితే సోషల్ మీడియాలో అభిమానులు మాత్రం రెండువైపులా భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు దిగ్వేశ్‌పై సరదాగా స్పందిస్తే, మరికొందరు మాత్రం ఇది అనవసరమైన ప్రవర్తన అంటూ విమర్శిస్తున్నారు. ఏదేమైనా, ఐపీఎల్‌లో ఆటగాళ్ల ప్రవర్తనపై బీసీసీఐ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు ఇకపై మరింత బాధ్యతగా ఆడేలా చేస్తాయనడంలో సందేహం లేదు.