భద్రాచలంలో కూలిన భవన నిర్మాణం… ఆరుగురు మృతి

తెలంగాణలో శ్రీ సీతారామ స్వామి కొలువై ఉన్న భద్రాచలంలో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం ఉన్నట్టుండి కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు భవన నిర్మాణ కూలీలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరింత మంది కూలీలు భవనం శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన అక్కడికి చేరుకుని శిథిలాలను తొలగించే పనిని చేపట్టారు. శిథిలాల కింద ఉన్న వారిని సజీవంగా బయటకు తీసుకువచ్చేందుకు సమీపంలోని నిర్మాణ రంగ కంపెనీల యంత్ర సామాగ్రిని వినియోగిస్తున్నారు.

భద్రాచలంలోని పంచాయతీ భవనం సెంటర్ కు సమీపంలో అప్పటికే రెండంతస్తుల భవనం ఉంది. అది ఓ ప్రైవేట్ వ్యక్తికి చెందిన ఆస్తిగా తెలుస్తోంది. చాలా కాలం క్రితమే రెండంతస్తుల భవనాన్ని నిర్మించిన సదరు స్థల యజమాని తాజాగా… దానిని కూల్చకుండానే… పాత భవనంపైనే మరో నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారట. అయితే పంచాయతీ కార్యాలయం నుంచి ఈ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవని చెబుతున్నారు. అనుమతులు లేకుండానే సదరు భవనాన్ని నిర్మిస్తున్న సదరు వ్యక్తి… ఇప్పటికే రెండంతస్తుల భవనం పై నాలుగు శ్లాబ్ లు వేశారు. శ్లాబ్ లు వేసిన తర్వాత ప్రస్తుతం అక్కడ గోడలు నిర్మించే కార్యక్రమాలు సాగుతున్నట్లు సమాచారం.

ఇలాంటి సమయంలో బుధవారం మధ్యాహ్నం భవన నిర్మాణ కూలీలు ఆ భవనం వద్ద పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలోనే నిర్మాణంలో ఉన్న ఆ భవనం పేక మేడలా కూలిపోయింది. ఫలితంగా భవనం లోపల ఉన్నవారు మృత్యువాత పడినట్లు సమాచారం. భవనం బయట ఉన్న వారిలో కొందరు పరుగులు తీసినా..మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన వెంటనే భవన యజమానికి పరారయ్యారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆరంతస్తులతో నిర్మాణం జరుగుతున్న భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో ఆ శబ్దానికి చుట్టుపక్కల ఇళ్ల వారు భయాందోళనలకు గురై…ఏం జరుగుతుందో తెలియక ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.