అమెరికా ఎన్నికల వ్యవస్థపై ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వచ్చే అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ట్రంప్ ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌కు సంతకం చేశారు. దీనితో ఎన్నికల ప్రాసెస్‌లో పౌరసత్వ ధ్రువీకరణ, మెయిల్-ఇన్ బ్యాలెట్ల లెక్కింపులో కొత్త మార్గదర్శకాలు ప్రవేశించనున్నాయి. గతంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇలావుంటే, తాజా ఆర్డర్ ప్రకారం ఓటర్లు తమ అమెరికన్ పౌరసత్వాన్ని స్పష్టంగా నిరూపించాల్సి ఉంటుంది. అలాగే, ఎన్నికల రోజునాటికి అందిన మెయిల్-ఇన్ లేదా గైర్హాజరీ బ్యాలెట్లను మాత్రమే లెక్కించాలన్న నిబంధనను ఈ ఆర్డర్ స్పష్టంగా పేర్కొంది. అమెరికన్ పౌరులు కాకపోయిన వారు రాజకీయ విరాళాలు ఇవ్వకుండా అడ్డుకునే విధంగా ఈ ఆదేశం రూపొందించబడింది. వలసదారుల ఓటింగ్ హక్కులపై ఇదొక ఆత్మపరిశీలన లాంటి చర్యగా భావిస్తున్నారు.
ఈ సందర్భంగా ట్రంప్ భారత్, బ్రెజిల్ వంటి దేశాల్లో అమలవుతున్న ఎన్నికల విధానాలను ఉదాహరణగా ప్రస్తావించారు. ఈ దేశాల్లో ఓటర్లు బయోమెట్రిక్ ఆధారంగా గుర్తింపును నిర్ధారించుకుంటుండగా, అమెరికాలో మాత్రం ఇప్పటికీ స్వీయ ధ్రువీకరణపై ఆధారపడడం దురదృష్టకరమని విమర్శించారు. ఓటింగ్ విధానంలో స్థిరత లేకపోవడం వల్లే మోసాలకు, అనుమానాలకు తావిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
“స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, మోసంలేని ఎన్నికలు మాత్రమే ఒక రాజ్యాంగ గణతంత్రానికి బలంగా నిలుస్తాయి,” అని ట్రంప్ స్పష్టంగా పేర్కొన్నారు. గతంలో ఎన్నికల ఫలితాలపై వ్యక్తమైన అనుమానాల నేపథ్యంలో ఈ రకమైన సంస్కరణలు ప్రజల విశ్వాసాన్ని తిరిగి చేకూర్చే అవకాశముంది. అయితే, వ్యతిరేక పార్టీలు ఈ ఆదేశాన్ని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించాయి. మరి ట్రంప్ ఈ విషయంలో ఇంకా ఎలాంటి ట్విస్టులు ఇస్తాడో.