ధోని రివ్యూ సిస్టమ్.. మళ్ళీ హైలెట్ అయ్యిందిగా..

ఐపీఎల్‌ 2025 మొదటి మ్యాచ్‌లో మరోసారి ధోని మెజిక్ కనిపించింది. చెన్నై సూపర్ కింగ్స్ లో ఎక్కువ ప్రభావం చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది మహేంద్ర సింగ్ ధోనీయే. ఎప్పటిలాగే ఈసారి కూడా ధోని రివ్యూ నిర్ణయం మ్యాచ్ మలుపు తిప్పింది. “ధోని రివ్యూ సిస్టమ్” అనే పదం క్రికెట్ అభిమానులకు మరోసారి గుర్తొచ్చేలా చేసింది.

ముంబైతో జరిగిన మ్యాచ్ లో 18వ ఓవర్లో జరిగిన ఓ పరిణామం అందరినీ అబ్బురపరిచింది. ముంబయి ఆటగాడు మిచెల్ సాంట్నర్‌ను పేసర్ నాథన్ ఎలిస్ ఎల్బీగా కోరాడు కానీ ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్‌గా తీర్పు ఇచ్చాడు. ఇక్కడే ధోని పాత్ర ప్రారంభమవుతుంది. కెప్టెన్ గా ఉన్న గైక్వాడ్‌కు వెంటనే ధోని రివ్యూకు వెళ్లమని సలహా ఇచ్చాడు. ఫలితంగా ఆ నిర్ణయం పర్ఫెక్ట్ గా వచ్చింది. బంతి నేరుగా వికెట్లను తాకుతున్నట్టు కనిపించడంతో అంపైర్ తన తీర్పును మార్చాల్సి వచ్చింది.

ఇదే దశలో ముంబయి 128/8కి కష్టాల్లో పడింది. ఈ సంఘటన తర్వాత నాథన్ ఎలిస్ ధోనిని హత్తుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ‘ధోని రివ్యూ సిస్టమ్’ సరిగ్గా పనిచేసిందనే సంకేతంగా ఇది మారింది. ధోని వయసు 43 ఏళ్లైనా గ్లవ్స్ వెనుక ఉన్న జాగ్రత్త, స్పష్టత, విశ్లేషణ సామర్థ్యం అంచనాలకూ అతీతం. ఈ మ్యాచ్‌లో మరో ముఖ్యమైన క్షణం.. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ స్టంపౌట్ కూడా ధోని చేతివింతకు మరో ఉదాహరణ.

ధోని ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం పెద్దగా రాలేదు. అయినప్పటికీ మైదానంలో ఉన్న మేధస్సుతో మరోసారి తన స్థాయిని నిరూపించాడు. ‘ధోని రివ్యూ సిస్టమ్’ మళ్లీ తెరపైకి రావడం, చెన్నై విజయంలో కీలకంగా నిలవడం అభిమానులకు మరిచిపోలేని అనుభూతిని అందించింది. ఐపీఎల్‌లో ఏ మైదానమైనా, ఏ జట్టు అయినా సరే.. ధోనికి సంబంధించిన ఒక్క నిర్ణయం మ్యాచ్ ఫలితాన్ని ఎటు తిప్పగలదన్నదికి ఇది మరో ప్రత్యక్ష ఉదాహరణ.